Agniveer: ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా పేలుడు.. ఇద్దరు అగ్నివీర్లు మృతి

by vinod kumar |   ( Updated:2024-10-11 13:14:56.0  )
Agniveer: ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా పేలుడు.. ఇద్దరు అగ్నివీర్లు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ఆర్టిలరీ సెంటర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఇద్దరు అగ్నివీర్లు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం మధ్యాహ్నం అర్టిలరీ కేంద్రంలో అగ్నివీర్లు ఇండియన్ ఫీల్డ్ గన్‌తో ఫైరింగ్ చేయడం ప్రాక్టీస్ చేస్తుండగా గన్‌లోని ఒక షెల్ పేలిపోయింది. దీంతో ఇద్దరు అగ్నివీర్లు తీవ్రంగా గాయపడగా వెంటనే వారిని డియోలాలిలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి వారు మరణించారు. మృతులను గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్ (21)గా గుర్తించారు. వీరిద్దరూ హైదరాబాద్ నుంచి శిక్షణకు వచ్చినట్టు తెలిపారు. హావల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ నెల 4న కూడా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో మాక్ డ్రిల్ సందర్భంగా పేలుడు సంభవించి 24 ఏళ్ల అగ్నివీర్ మరణించారు.

Advertisement

Next Story