‘తుది’ విడత పోలింగ్ 58.34 శాతం.. రేపు సిక్కిం, అరుణాచల్‌ రిజల్ట్

by Hajipasha |
‘తుది’ విడత పోలింగ్ 58.34 శాతం.. రేపు సిక్కిం, అరుణాచల్‌ రిజల్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. శనివారం రోజు దేశంలోని 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో ఏడో విడత ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి 58.34 శాతం ఓటింగ్ నమోదైంది. బెంగాల్‌లో అత్యధికంగా 69.89 శాతం ఓటింగ్.. బిహార్‌లో అత్యల్పంగా 48.46 శాతం పోలింగ్ జరిగింది. జార్ఖండ్‌లో 67.95 శాతం, హిమాచల్ ప్రదేశ్‌లో 66.56 శాతం, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌లో 62.80 శాతం, ఒడిశాలో 62.46 శాతం, పంజాబ్‌లో 55.20్ శాతం, ఉత్తరప్రదేశ్‌లో 54 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక సార్వత్రిక ఎన్నికల తొలి ఆరు దశల్లో వరుసగా 66.14 శాతం, 66.71 శాతం, 65.68 శాతం, 69.16 శాతం, 62.2 శాతం, 63.36 శాతం పోలింగ్ నమోదైంది.

స్థానికులు, పోలింగ్‌ ఏజెంట్లకు మధ్య వివాదం

ఏడో విడత ఎన్నికల వేళ బెంగాల్‌లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ఉదయం ఆరున్నర గంటల సమయంలో 24 పరగణా జిల్లాలోని ఓ పోలింగ్‌బూత్‌‌పై మూక దాడి జరిగింది. కుల్తాలీ గ్రామంలో రిజర్వులో ఉంచిన ఈవీఎంలు, 2 వీవీ ప్యాట్లు, సెక్టార్‌ ఆఫీసర్‌ పత్రాలను ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ చెరువులో పడేశారు. పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో స్థానికులు, పోలింగ్‌ ఏజెంట్లకు మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు బలవంతంగా పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించి ఈవీఎంను బయటకు తీసుకెళ్లి చెరువులో పడేశారు. ఆ పోలింగ్‌ కేంద్రంలో అదనపు ఈవీఎంలు తరలించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సెక్టార్ ఆఫీసర్ సమాచారంతో వారు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మహిళలు వెదురు కర్రలు, రాళ్లతో..

బెంగాల్‌లోని మేరిగంజ్‌లో ఉన్న 2 పోలింగ్ కేంద్రాల వద్ద బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు దాడి చేసుకోగా, పలువురికి గాయాలయ్యాయి. జాదవ్‌పూర్‌లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్​ఎఫ్), సీపీఎం మద్దతుదారుల మధ్య ఘర్షణ జరగగా.. ఐఎస్​ఎఫ్ కార్యకర్తలు గాయపడ్డారు. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం బాంబులు విసురుకున్నారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. భంగర్‌తో పాటు దక్షిణ 24 పరగణా జిల్లాలోని ఇత్‌ఖొలాలో వివిధ పార్టీల కార్యకర్తల మధ్య రాళ్లదాడులు జరిగాయి. సందేశ్‌ఖాలీలో అత్యాచార నిందితుడు టీఎంసీ నేత షేక్‌షాజహాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. మహిళలు వెదురు కర్రలు, రాళ్లతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. జయనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.

ఓటువేసిన ప్రముఖులు వీరే..

ఏడో విడతలో ఓటు వేసిన ప్రముఖుల జాబితాలో.. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, హిమాచల్‌‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఉన్నారు. ఈ విడతలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్, కంగనారనౌత్‌, క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, ఆర్జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌, రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ స్టేషన్‌లో..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్‌ హిమాచల్ ప్రదేశ్‌లోని తాషిగంగ్‌ గ్రామంలో ఉంది. ఈ పోలింగ్ బూత్ 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఊరు భారత్‌- చైనా వాస్తవాధీన రేఖ సమీపంలో ఉంది. మండి నియోజకవర్గంలోని స్పితి లోయ ప్రాంతం ప్రజలు ఇక్కడ ఓటు వేశారు. తాషిగంగ్‌లో మొత్తం 62 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 37 మంది పురుషులు, 25 మంది మహిళలు. కాగా, జూన్‌ 2న సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూన్‌ 4న లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతాయి.

Advertisement

Next Story