రూ. 31,580 కోట్లు మోసం చేసిన మహిళ.. ఇప్పుడెక్కడుంది? ఆమె ఆచూకీ దొరికిందా?

by S Gopi |
రూ. 31,580 కోట్లు మోసం చేసిన మహిళ.. ఇప్పుడెక్కడుంది? ఆమె ఆచూకీ దొరికిందా?
X

దిశ, నేషనల్ బ్యూరో: సుమారు రూ.32 వేల కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీ స్కామ్ చేసిందనే ఆరోపణలతో ఒక మహిళ కోసం అమెరికా పదేళ్ల నుంచి వెతుకుతోంది. ఎఫ్‌బీఐ టాప్-10 మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చిన ఆమె ఆచూకీ ఇప్పటికీ తెలియదు. ఆచూకీ చెప్పిన వారికి సుమారు లక్ష డాలర్లు బహుమతి ఇస్తామని ఎఫ్‌బీఐ ప్రకటించింది కూడా. అయితే, ఇన్నేళ్లు గడుస్తున్నా ఆమె ఎక్కడున్నది, ఏమైనది ఎవ్వరికీ తెలియదు. బల్గేరియాకు చెందిన రూహా ఇగ్నతోవ.. 'వన్ కాయిన్' పేరుతో 2014లో క్రిప్టో కరెన్సీ తీసుకొచ్చినట్టు ప్రకటించారు. ఈ 'వన్ కాయిన్‌'ను విక్రయించిన వారికి కమిషన్లు కూడా ఇచ్చారు. అలా 'వన్ కాయిన్' పేరుతో 4 బిలియన్ డాలర్లు(రూ. 31,580 కోట్లు) పోగేసుకుని రూహా ఇగ్నతోవ బోర్డు తిప్పేసినట్లు అమెరికా అధికారులు చెప్పారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లోని లక్షలాది మందిని మోసం చేసిన ఆమె గురించి బీబీసీ కూపీ లాగింది. రూహా ఇగ్నతోవ ఆచూకీ కోసం ఏడాదికి పైగా వెతికిన బీబీసీకి.. ఆమెకు బల్గేరియా డ్రగ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్టు తేల్చింది. ఆ దేశ అత్యంత దుర్మార్గ క్రైమ్ బాస్ హ్రిస్టోఫోరోస్ నికోస్ అమనాటిడిస్‌(టాకీ)తో ఆమె సన్నితంగా ఉన్నట్టు తెలిసింది. ఎఫ్‌బీఐతో పాటు యూఎస్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కోసం దర్యాప్తు చేస్తున్న రిచర్డ్ రీన్‌హార్డ్ట్.. ఆమెకు టాకీ అనే నేరస్తుడు బాడీగార్డ్‌గా ఉన్నట్టు చెప్పారు. ఆమె తన బాడీగార్డ్‌తో బల్గేరియా నుంచి ఏథెన్స్‌కు వెళ్లిందని, ఆ తర్వాత టాకీ మాత్రమే తిరిగొచ్చాడని రిచర్డ్ పేర్కొన్నారు. బల్గేరియాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుడైన టాకీకి వన్‌కాయిన్ మోసంలో సంబంధాలు ఉన్నట్టు ఆధారాలున్నాయని అసిస్టెంట్ అటార్నీ చెప్పారు.

బీబీసీ పరిశోధనలో డ్రగ్స్ అక్రమ రవాణాలో వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించేందుకు వన్‌కాయిన్ నెట్‌వర్క్‌ను టాకీ వాడుకున్నట్టు తేలింది. అయితే టాకీని ఎవరూ చూడలేరని, అతని గురించి మాత్రమే కథనాలు వినబడతాయని సమాచారం. 'అతను చెప్పింది వినకపోతే ఎవరైనా భూమ్మీద బతకలేరు. రూహా ఇగ్నతోవను రక్షించగల ఏకైన వ్యక్తి టాకీ మాత్రమేనని' బల్గేరియన్ మాజీ డిప్యూటీ మంత్రి ఇవాన్ హ్రిస్టానోవ్ అన్నారు. టాకీ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. రక్షణ కోసం రూహా ఇగ్నతోవ అతనికి నెలకు లక్ష యూరోలు(రూ. 90.2 లక్షలు) చెల్లించినట్టు బల్గేరియాలోని స్థానికులు చెప్పారు.

మరోవైపు, రూహా ఇగ్నతోవను టాకీనే హత్య చేశాడని ఊహాగానాలు కూడా బీబీసీ పరిశోధనలో వినిపించాయి. రూహా ఇగ్నతోవ హత్య చేయబడిందని కొందరు స్థానికులు చెప్పారని బీబీసీ పేర్కొంది. 2018 చివర్లో టాకీ ఆదేశాలతో ఆమెను హత్య చేసి, అయోనియన్ సముద్రంలో పడేశామని టాకీ బావమరిది తాగిన మత్తులో చెప్పినట్టు ఓ విలేకరి స్పష్టం చేశారు. రూహా ఇగ్నతోవ భారంగా మారడం వల్లే టాకీ ఆమెను చంపమన్నట్టు సమాచారం. ఆమె ఆస్తులను ఇప్పుడు టాకీకి చెందిన వ్యక్తులు చూస్తున్నారు. కానీ, రూహా ఇగ్నతోవ హత్య ఆరోపణలతో టాకీ అరెస్ట్ అవలేదు, ఆమె మృతదేహం లభించలేదు. కాబట్టి రూహ ఇగ్నతోవ గురించి వినిపించేవన్నీ పుకార్లుగానే ఉండిపోతున్నాయని బీబీసీ వెల్లడించింది.

Advertisement

Next Story