‘ఢిల్లీ చలో’ 29వరకు వాయిదా

by Swamyn |
‘ఢిల్లీ చలో’ 29వరకు వాయిదా
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ ఆందోళనలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 29వరకు నిలిపివేస్తున్నట్టు ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న ‘సంయుక్త కిసాన్ మోర్చా’(ఎస్కేఎం) రైతు సంఘం శుక్రవారం వెల్లడించింది. తమ తర్వాతి కార్యాచరణను 29న ప్రకటించాలని నిర్ణయించినట్టు ఖనౌరీలో నిర్వహించిన మీడయా సమావేశంలో రైతు నేత శర్వన్ సింగ్ తెలిపారు. ఎందుకు వాయిదా వేశారన్న కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. శుక్రవారం బ్లాక్ డేను పాటించిన అన్నదాతలు.. 26న ట్రాక్టర్ పరేడ్ గురువారమే చేపడతామని వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ, తాజా నిర్ణయంతో ట్రాక్టర్ పరేడ్ సైతం వాయిదా పడినట్టు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా, శుక్రవారం నాటి ఆందోళనలు సైతం ఉద్రిక్తంగా మారాయి. హర్యానా నుంచి పంజాబ్ సరిహద్దు ప్రాంతం ఖనౌరీ వైపు వెళ్తున్న రైతులను చెదరగొట్టడానికి హర్యానా పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. పలువురు ఆందోళనాకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో రైతులతోపాటు పోలీసులు సైతం గాయపడ్డారు. మరోవైపు, శుభకరన్ సింగ్‌ మృతికి కారణమైనవారిపై పంజాబ్ ప్రభుత్వం కేసు నమోదు చేసేదాకా అంత్యక్రియలు చేయబోమని భీష్మించుకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనల్లో మృతిచెందిన శుభకణ్ సింగ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందజేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు.

సుప్రీంకోర్టులో పిటిషన్

ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకుంటున్న కేంద్రం చర్యలను సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, పలువురు రైతు నేతలపై హర్యానా ప్రభుత్వం ‘జాతీయ భద్రతా చట్టాన్ని’(ఎన్ఎస్ఏ) ప్రయోగించింది. ఈ చట్టం ప్రకారం, జాతీయ భద్రతకు భంగం కలిగించే చర్యకు పూనుకున్నట్టు అనిపిస్తే, సదరు వ్యక్తిని కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధించవచ్చు. అయితే, ఈ చట్టం ప్రయోగించిన కొద్దిసేపటికే తిరిగి వెనక్కి తీసుకోవడం గమనార్హం. అనంతరం, రాష్ట్రంలోని రైతులకు పంట రుణాలపై వడ్డీని మాఫీ చేస్తున్నట్టు హర్యానా సీఎం ఖట్టర్ ప్రకటించారు. కాగా, పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.


Advertisement

Next Story