Rahul Gandhi: లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్

by Shamantha N |
Rahul Gandhi: లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) విమర్శలు గుప్పించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రమాణ స్వీకారోత్సవం విషయంలో తన పర్యటనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాహుల్‌ ఆరోపణలను ఖండించారు. ‘‘కొద్ది రోజుల క్రితం నేను వెళ్లిన అమెరికా పర్యటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నేను జో బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌లోని సెక్రటరీ, ఎన్‌ఎస్‌ఏను కలిసేందుకు అక్కడి వెళ్లాను. అదేవిధంగా మన కాన్సుల్స్‌ జనరల్‌ సమావేశానికి అధ్యక్షత వహించాను. అంతేగానీ, ప్రధాని మోడీకి ఆహ్వానం అందించడం గురించి ఎలాంటి చర్చలు జరపలేదు’’ అని జైశంకర్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా స్పష్టతనిచ్చారు. సాధారణంగా మోడీ ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకారనే విషయం అందరికీ తెలున్నారు. అయినప్పటికీ, రాహుల్ గాంధీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఇలాంటి ప్రకటనలు చేసి దేశ, విదేశాల్లో భారత్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

రాహుల్ ఏమన్నారంటే?

అయితే, ప్రమాణ స్వీకారానికి ముందు గతేడాది డిసెంబరులో జైశంకర్‌ అమెరికా పర్యటన చేశారు. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించాలని అమెరికాను కోరేందుకు జైశంకర్ వెళ్లి ఉంటారు. ఆహ్వానం కోసం మూడు నుంచి నాలుగు సార్లు ఆయన్ను అక్కడి పంపారు’’ అంటూ కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యానించారు. దీనిపైనే విదేశాంగ మంత్రి మండిపడ్డారు. రాహుల్ గాంధీ చెప్పేవి అవాస్తవమని కొట్టిపారేశారు. మరోవైపు, రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశ ప్రధాని మోడీ గురించి ఆయన నిరాధారమైన ప్రకటనలు ఎలా చేస్తున్నారు?రెండు దేశాల మధ్య సంబంధాలపై రాహుల్ ఈ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారని నిప్పులు చెరిగారు.

Next Story

Most Viewed