Ghibli: ఇట్స్ ‘ఘిబ్లీ’ టైమ్.. చాట్ జీపీటీ క్రియేట్ యానిమేషన్ ఫొటోలు.. ఎలా చేయాలంటే?

by Ramesh N |
Ghibli: ఇట్స్ ‘ఘిబ్లీ’ టైమ్.. చాట్ జీపీటీ క్రియేట్ యానిమేషన్ ఫొటోలు.. ఎలా చేయాలంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ప్రస్తుతం (Studio Ghibli-Style) ఘిబ్లీ స్టైల్ యానిమేషన్ ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. సాధారణ యూజర్ల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు సైతం వారి యానిమేషన్ ఫొటోలను సొంతంగా క్రియేట్ చేసుకోని తెగ మురిసిపోతూ ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇటీవల ఓపెన్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ 4వో అప్‌డేట్‌తో ఒక ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మన ఫొటోలను చేతితో గీసిన చిత్రాల మాదిరిగా మార్చుకోవచ్చు. ఇది ఫేమస్ జపనీస్ యానిమేషన్ స్టూడియో ‘ఘిబ్లీ’ స్టైల్‌లో AI ఇమేజెస్‌ క్రియేట్ చేస్తోంది. నెట్టింట ఈ ఘిబ్లీ బొమ్మలు, పాపులర్ మీమ్స్ ఘిబ్లీ స్టైల్లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి.

ఘిబ్లీఫైడ్ గ్యాంగ్

ప్రస్తుతం ‘ఎక్స్’, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల వేదికగా వారివారి ఘిబ్లీ చిత్రాలను యూజర్లు షేర్ చేస్తున్నారు. రాజకీయ నాయుకులు ట్రెండింగ్‌లోకి నేను సైతం అంటూ ఘిబ్లీ ఇమెజ్‌లు పోస్ట్ చేస్తున్నారు. కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోడీతో దిగిన ఘిబ్లీ ఇమేజ్‌లను షేర్ చేశారు. ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు సైతం ‘ఘిబ్లీ ట్రెండ్‌లో చేరుతున్నాను.. ఇదిగో నా ఎంట్రీ’ అంటూ ప్రధాని మోడీ, జనసేన చీఫ్ పవన్‌తో కలిసి దిగిన ఘిబ్లీ ఇమేజ్‌లు, కుటుంబ సభ్యుల ఫొటోలను షేర్ చేశారు. అదేవిధంగా ఏపీ మంత్రి నారా లోకేశ్.. కుమారుడు నారా దేవాన్ష్, సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి దిగిన ఫొటోలను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘హ్యాపీ టు జాయిన్ ఘిబ్లీ ఫైడ్ గ్యాంగ్’ అంటూ నారా లోకేశ్ ఈ ఫొటోలను షేర్ చేశారు.

ఘిబ్లీ అంటే ఏమిటీ?

స్టూడియో ఘిబ్లీ అనేది ఒక ప్రఖ్యాత జపాన్ యానిమేషన్ స్టూడియో, ఇది 1985లో హయావో మియాజాకీ, ఇసావో తకాహటా, తోషియో సుజుకీ అనే ముగ్గురు స్థాపించారు. ఇది తన అద్భుతమైన చేతితో గీసిన యానిమేషన్, ఊహాత్మక కథనాలకు ప్రసిద్ధి చెందింది. వారి సినిమాల్లో స్పిరిటెడ్ అవే(2003లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ కోసం ఆస్కార్ గెలుచుకుంది), మై నీబర్ టోటోరో, ప్రిన్సెస్ మోనోనోకే వంటివి ఉన్నాయి. ఈ చిత్రాలు తరచూ పర్యావరణం, మానవత్వం, స్వీయ ఆవిష్కరణ వంటి ఇతివృత్తాలను చూపిస్తాయి. ‘ఘిబ్లీ’ అనే పేరు అరబిక్ భాషలో సహారా ఎడారిలో వీచే వేడి గాలిని సూచించే పదం నుంచి వచ్చింది. ఇది యానిమేషన్ పరిశ్రమలో కొత్త శక్తిని తీసుకురావాలనే వారి లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.

ఎలా చేయాలంటే?

గూగుల్ ఐడీతో ChatGPT 4oలో సైన్ ఇన్ అయితే ఘిబ్లీ ఫొటోలు తయారు చేసుకోవచ్చు. మనం దిగిన సాధారణ ఫొటోను చాట్‌బాట్‌కి ఏ విధంగా కావాలో ప్రాంప్ట్ ఇచ్చి వివరించాలి. అచ్చం ఘిబ్లీ సినిమాల్లో ఉన్నట్టు బొమ్మలు రావాలంటే మీకు కావాల్సిన వాటిని స్పష్టంగా చెప్పాలి. ఉదాహరణకు, ప్రశాంతమైన పల్లెటూరు, వాతావరణం, అడవి, జంతువులు, ముఖ కవళికలు సైతం వివరించవచ్చు. అందులో ‘స్టూడియో ఘిబ్లీ స్టైల్’(Studio Ghibli style) అనే కీవర్డ్ తప్పకుండా ఉండాలి. అది క్షణాల్లో అద్భుతమైన మన జపానీస్ యానిమేషన్‌ను జెనరేట్ చేసి ఇస్తుంది. ఈ ఘిబ్లీ స్టైల్ ఫ్రీగా కూడా కొంత లిమిట్ వరకే అందుబాటులో ఉంది. మరోవైపు పెయిడ్ సబ్‌స్కైబర్లు అన్‌లిమిటెడ్‌గా ఎన్ని ఇమేజ్‌లు అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏఐ చాట్‌బాట్ అయిన ‘గ్రోక్‌’లో సైతం ఈ ఫిచర్ అందుబాటులో ఉంది.

Next Story

Most Viewed