రాష్ట్రపతి, సీజేఐకి లేఖ రాసిన మాజీ హైకోర్టు న్యాయమూర్తులు

by S Gopi |
రాష్ట్రపతి, సీజేఐకి లేఖ రాసిన మాజీ హైకోర్టు న్యాయమూర్తులు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల నిర్వహణ తీరుపై 'ఆందోళన ' వ్యక్తం చేస్తూ ఏడుగురు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌లకు బహిరంగ లేఖ రాశారు. పౌర, మానవ హాక్కుల సంస్థలు సహా చాలామంది ప్రజల మనస్సులలో భయాలు ఉన్నాయని వారు లేఖలో పేర్కొన్నారు. 'భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) 2024 సాధారణ ఎన్నికలు నిర్వహించిన విధానం గురించి ఆందోళన ఉంది. ప్రస్తుత పాలక యంత్రాంగం ప్రజల నిర్ణయం వేరుగా ఉంటే అధికార మార్పిడి సజావుగా ఉండకపోవచ్చు. తద్వారా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడవచ్చని' న్యాయమూర్తులు లేఖలో పేర్కొన్నారు. హంగ్ ఏర్పడే అవకాశాలు ఉంటే భారత రాష్ట్రపతి భుజాలపై గురుతర బాధ్యతలు ఉంటాయి. ఎక్కువ సీట్లు గెలిచిన కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తారని అనుకుంటున్నాము. ఎన్నికలు సజావుగా ముస్తాయని, ఓట్ల లెక్కింపు నిష్పక్షపాతంగా ఉండాలని, నిజాయితీగా ఫలితాలు రావాలని భావిస్తున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఫలితాల సమయంలో నేతలను ప్రభావితం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని వారు స్పష్టం చేశారు. అలాగే గతవారం మాజీ సివిల్ సర్వెంట్లు ఎన్నికల నిష్పక్షపాతంపై ఆందోళన వ్యక్తం చేసిన అంశాన్ని వారు ప్రస్తావించారు. బాధ్యతగల సంస్థలు, సమాజంలోని గౌరవప్రదమైన సభ్యుల ఉల్లంఘనలను పదేపదే తమ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ విధులను నిర్వర్తించడంలో ఎన్నికల కమిషన్ విముఖత చూపడం బాధించిందని మాజీల్ సివిల్ సర్వెంట్ల సంఘం తన ప్రకటనలో చెప్పారు. మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జీఎం అక్బర్ అలీ, అరుణ జగదీశన్, డి హరిపరంతనం, పీఆర్ శివకుమార్, సిటి సెల్వం, ఎస్ విమల, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అంజనా ప్రకాష్‌లు తమ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని లేఖలో సంతకాలు చేశారు.

Advertisement

Next Story