ఆధారాలు సమర్పించకపోతే చర్యలు తప్పవు: జైరాం రమేష్‌కు ఈసీ స్పష్టత

by S Gopi |
ఆధారాలు సమర్పించకపోతే చర్యలు తప్పవు: జైరాం రమేష్‌కు ఈసీ స్పష్టత
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా 150 మంది జిల్లా మెజిస్ట్రేట్లను ప్రభావితం చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆరోపణలను రుజువు చేసే ఆధారాలను సమర్పించాలని ఆదివారం జైరామ్ రమేష్‌ను కోరింది. అయితే, అందుకు వారం రోజులు సమయం కావాలని కాంగ్రెస్ నేత అభ్యర్థించారు. కానీ, ఆ అభ్యర్థనను నిరాకరించిన ఈసీ సోమవారం సాయంత్రానికే ఆధారాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. గడువు పొడిగించాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. మీరు చేసిన ఆరోపణలను రుజువు చేస్తూ ఆధారాలను ఇవ్వలేకపోతే అందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది. జైరాం రమేష్ చేసిన ఆరోపణలు ఒక సీనియర్ నేతగా తీవ్రమైనవి. కౌంటింగ్‌కి ముందు జిల్లా మెజిస్ట్రేట్‌లు, జిల్లా ఎన్నికల అధికారుల గౌరవాన్ని, పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని ఎన్నికల సంఘం సోమవారం ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story