ఉద్ధవ్ ఠాక్రేకు ఈసీ భారీ షాక్!

by Sathputhe Rajesh |
ఉద్ధవ్ ఠాక్రేకు ఈసీ భారీ షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఈసీ షాక్ ఇచ్చింది. 'శివసేన' పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు 'విల్లు - బాణం', సీఎం ఏక్ నాథ్ షిండే చీలక వర్గాన్నికే చెందుతుందని స్పష్టం చేసింది. శివసేన తనదేనని ప్రకటించాలని కోరుతూ ఆరు నెలల క్రితం షిండే పిటిషన్ దాఖలు చేయగా ఈసీ తాజాగా ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. కాగా బాల సాహెబ్ ఠాక్రే నేతృత్వంలో 1966లో శివసేన ఆవిర్భవించింది. అప్పటి నుంచి శివసేన ఠాక్రే కుటుంబం చేతుల్లోనే ఉంది. గతేడాది జూన్‌లో శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేకు మద్దతివ్వడంతో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది.

ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో శిండే సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ, ఎన్నికల గర్తు కోసం రెండు వర్గాలు పోటీపడగా తాజా ఈసీ నిర్ణయంతో శివసేన ఏక్ నాథ్ షిండ్ వర్గం సొంతమయింది. దీనిపై శివసేన మాజీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపారు. ఈసీ వ్యవహార తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ఈ‌సీ నిర్ణయాన్ని సమర్థించారు.

Advertisement

Next Story