rain alert: దేశ రాజధానిలో భారీ వర్షం.. స్కూళ్లకు సెలవులు

by Harish |
rain alert: దేశ రాజధానిలో భారీ వర్షం.. స్కూళ్లకు సెలవులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు వీడటం లేదు. బుధవారం సాయంత్రం భారీగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఘాజీపూర్‌లో ఖోడా కాలనీ సమీపంలో నీటి కాలువలో జారిపడి తనూజ అనే 22 ఏళ్ల మహిళ, ఆమె మూడేళ్ల కుమారుడు ప్రియాంష్ మృతి చెందారు. ఉత్తర ఢిల్లీలోని సబ్జీ మండి ప్రాంతంలో, రాబిన్ సినిమా సమీపంలో ఒక ఇల్లు కూలి ఒక వ్యక్తి గాయపడగా, వసంత్ కుంజ్‌లో, భారీ వర్షాల కారణంగా గోడ కూలిపోవడంతో ఒక మహిళ గాయపడింది. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో విద్యాశాఖ మంత్రి అతిషి గురువారం నగరంలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లకు వెళ్లే రహదారులపై నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ విభాగం గురువారం కూడా ఢిల్లీలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేసింది. రావూస్‌ అకాడమీలో ముగ్గురు విద్యార్థుల మృతికి నిరసనగా ఓల్డ్‌ రాజేందర్‌నగర్‌లో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన సివిల్స్‌ అభ్యర్థులు భారీ వర్షంలోనూ ఆందోళన కొనసాగిస్తున్నారు.

మరోవైపు ఢిల్లీలో ఆగస్టు 5 వరకు ఢిల్లీలో అడపాదడపా జల్లులు కురిసే అవకాశం ఉందని, అలాగే పిడుగుపాట్లు కూడా పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుంది. ఢిల్లీకి వెళ్లే 10 విమానాలను జైపూర్, లక్నోకు మళ్లించారు. వర్షాలు ఇలాగే కొనసాగితే మరికొన్ని విమానాల సమయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed