Doctor stabbed: తల్లికి వైద్యం అందడం లేదని ఆగ్రహం.. డాక్టర్‌ను ఏడు సార్లు కత్తితో పొడిచిన యువకుడు

by vinod kumar |
Doctor stabbed: తల్లికి వైద్యం అందడం లేదని ఆగ్రహం.. డాక్టర్‌ను ఏడు సార్లు కత్తితో పొడిచిన యువకుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన తల్లికి సరిగా వైద్యం అందించడం లేదన్న కోపంతో ఓ యువకుడు ప్రభుత్వ డాక్టర్‌ను కత్తితో తీవ్రంగా పొడిచాడు. చెన్నయ్‌లోని కలైంజర్ సెంటినరీ ఆస్పత్రి (Kalaignar Centenary hospital)లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నయ్ కి చెందిన విఘ్నేష్ అనే యువకుడు తన తల్లికి క్యాన్సర్ ఉండటంతో ఆస్పత్రిలో చేర్చాడు. గతంలో కీమోథెరపీ చేయించుకున్నా తన తల్లి పరిస్థితి ఎంతకూ మెరుగుపడక పోవడంతో తల్లికి చికిత్స చేసిన బాలాజీ జగన్నాథన్ (Balaji jagannadhan) అనే డాక్టర్‌పై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం ఆస్పత్రిలోని క్యాన్సర్ వార్డులో బాలాజీ విధుల్లో ఉండగా దాడికి పాల్పడ్డాడు. మెడ, చెవి, నుదురు, వీపు, పొట్టపై ఏడు సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలపాలైన డాక్టర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై సీఎం స్టాలిన్ (stalin) స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు తగిన వైద్యం అందించడంలో వైద్యుల సేవ ఎనలేనిది. వారికి భద్రత కల్పించడం మన కర్తవ్యం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు బీజేపీ నేత తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడుతూ.. తమిళనాడులో వైద్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి ఈ ఘటనే నిదర్శనమని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed