దేవెగౌడ మనవడు ప్రజ్వల్ అరెస్ట్.. నెక్ట్స్ ఏం జరిగిందంటే ?

by Hajipasha |
దేవెగౌడ మనవడు ప్రజ్వల్ అరెస్ట్.. నెక్ట్స్ ఏం జరిగిందంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన వీడియోలు వైరల్ కాగానే జర్మనీకి పారిపోయిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ ఎట్టకేలకు ఇండియాకు తిరిగొచ్చారు. గత కొన్ని వారాలుగా జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో తలదాచుకున్న ఆయన విమానమెక్కి శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యారు. దీంతో ప్రజ్వల్‌ను తొలుత ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే అరెస్టు వారెంటు చూపించి ఐదుగురు మహిళా పోలీసుల బృందం ఆయన్ను అరెస్టు చేసింది. ప్రత్యేక దర్యాప్తు టీమ్(సిట్) పంపించిన ఈ పోలీసుల టీమ్‌కు ఇద్దరు మహిళా ఐపీఎస్‌ అధికారిణులు సుమన్‌ డీ పెన్నేకర్‌, సీమా లాట్కర్‌ నేతృత్వం వహించారు. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి సీఐడీ కార్యాలయానికి ప్రజ్వల్‌ను తరలించే క్రమంలోనూ ఆ జీపులో మహిళా పోలీసు అధికారిణులే ఉన్నారు. ‘‘ఎంపీ పదవిని అడ్డంపెట్టుకొని మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆయన్ను అరెస్టు చేసే అధికారం ఆ మహిళలకే ఉందనే సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నాం’’ అని సిట్‌ అధికారులు వెల్లడించారు. ఇక సీఐడీ కార్యాలయానికి తరలించిన వెంటనే ప్రజ్వల్ రేవణ్ణకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బెంగళూరులోని కోర్టు ఎదుట హాజరుపర్చారు.సిట్ అధికారులు 14 రోజుల కస్టడీని కోరగా.. కోర్టు ఆయనకు ఏడు రోజుల (జూన్‌ 6 వరకు) కస్టడీ విధించింది.

భవానీ రేవణ్ణకు చుక్కెదురు..

ప్రజ్వల్ రేవణ్ణ కేసులో బాధితురాలిగా ఉన్న ఓ మహిళ మైసూరులో కిడ్నాప్ అయిన వ్యవహారంలో భవానీ రేవణ్ణ ప్రమేయం ఉందని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ తల్లే భవానీ రేవణ్ణ. ఈనేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఇంటి పని మనిషి కిడ్నాప్ వ్యవహారంలో భవానీ రేవణ్ణను విచారిస్తే కీలకమైన సమాచారం బయటికొస్తుందని కోర్టులో సిట్ తరఫు న్యాయవాది వాదించారు. దీనితో ఏకీభవించిన న్యాయస్థానం భవానీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. శనివారం రోజు హసన్ జిల్లాలోని నివాసంలో విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈసందర్భంగా భవానీ రేవణ్ణను సిట్ కోరింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించింది.

Advertisement

Next Story