ఢిల్లీలో కారును కడిగితే రూ.2,000 జరిమానా

by Harish |
ఢిల్లీలో కారును కడిగితే రూ.2,000 జరిమానా
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో తీవ్ర నీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో వృధాను అరికట్టడానికి కీలక చర్యలను తీసుకుంటామని మంత్రి అతిషి ప్రకటించిన ఒకరోజు తర్వాత ఢిల్లీ జల్ బోర్డ్ నుంచి తాజాగా కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇళ్లకు సరఫరా అయ్యే నీటిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం, పైపులతో కార్లను కడగడం, ట్యాంకులు పొంగిపొర్లడం ద్వారా నీళ్లను వృధా చేసినట్లయితే రూ.2000 జరిమానా విధించనున్నారు. నగరంలో నీటి సరఫరాను మెరుగుపరచడానికి అలాగే, వృధాను అరికట్టడానికి పర్యవేక్షణ కోసం మంత్రి అతిషి 200 బృందాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ జల్ బోర్డ్ CEO ఎ అన్బరసుకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ బృందాలు నివాస ప్రాంతాలను సందర్శించి తాగునీరు వృధా అవుతున్నాయో లేదో తనిఖీ చేస్తారు. పైప్‌ల నీటితో కార్లను కడగడం, నీటి ట్యాంకులు పొంగిపొర్లడం, గృహావసరాల కోసం ఉద్దేశించిన నీళ్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం, నిర్మాణ స్థలాల వద్ద తాగునీటిని ఉపయోగించడం వంటి కార్యకలాపాలు తనిఖీ చేస్తారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి నీటిని వృధా చేసినట్లయితే రూ.2000 జరిమానా విధిస్తారు.

ఢిల్లీలో ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు పైగా నమోదవడం, మే ప్రారంభం నుంచి ఢిల్లీకి యమునా నీటి విడుదలను హర్యానా నిలిపివేయడంతో నీటి సంక్షోభం మరింత తీవ్రమైందని మంత్రి పేర్కొన్నారు. దక్షిణ ఢిల్లీలోని అనేక పరిసర ప్రాంతాలకు ఇప్పుడు రోజుకు రెండు సార్లు బదులుగా ఒకసారి మాత్రమే నీళ్లు సరఫరా చేస్తున్నారు. గ్రేటర్ కైలాష్, లజ్‌పత్ నగర్, పంచశీల్ పార్క్, హౌజ్ ఖాస్, చిత్తరంజన్ పార్క్ వంటి ఏరియాల్లో రోజులో ఒక్కసారి మాత్రమే నీళ్ల సరఫరా జరుగుతుంది. రోజుకు రెండుసార్లు నీరు సరఫరా అవుతున్న చోట రోజుకు ఒక్కసారైనా నీటిని నిలిపివేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని తెలుసు, అయితే నగరంలోని ఇతర ప్రజలకు నీళ్లు సరఫరా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

Advertisement

Next Story