ఢిల్లీ స్కూల్ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర?

by Mahesh Kanagandla |
ఢిల్లీ స్కూల్ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో రోహిణి ఏరియాలో ఆదివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ స్కూల్ ఎదుట చోటుచేసుకున్న పేలుడు కలకలం రేపింది. పేలుడుతో సీఆర్‌పీఎఫ్ గోడ ధ్వంసమైంది. చుట్టుపక్కల ఉన్న షాపుల దుకాణాల, పార్క్ చేసిన వాహనాల అద్దాలు పగిలిపోయాయి. భీకర శబ్దంతో పేలుడు సంభవించగా క్షణాల్లోనే దట్టమైన పొగ ఘటనాస్థలి నుంచి ఆకాశంలోకి వెళుతూ కనిపించింది. స్థానికులు భయాందోళనలతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ, సీఆర్‌పీఎఫ్, ఎన్ఎస్‌జీ, ఎన్ఐఏ బృందాలు స్పాట్‌కు చేరుకున్నాయి. శాంపిళ్లు తీసుకున్న ఎఫ్ఎస్ఎల్.. పేలుడుకు వేటిని ఉపయోగించారనేది నిర్ధారించనుంది.

సీఆర్‌పీఎఫ్ స్కూల్ ధ్వంసం చేయడానికి క్రూడ్ బాంబ్‌ను వినియోగించారని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. గోడ లోపల.. అదీ ఎక్కువ మంది ఉండని ఉదయంపూట పేలుడు సంభవించడమంటే.. నిందితులు ఒక సందేశాన్ని ఇస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చని పోలీసువర్గాలు వివరించాయి. డ్యామేజీ చేయాలనే ఉద్దేశ్యంతోకాకుండా ఒక మెస్సేజీని ఇవ్వాలనే ఆలోచనతో ఈ పేలుడు జరిపి ఉండొచ్చని తెలిపాయి. అదే విధంగా స్పాట్‌లో వైట్ పౌడర్‌ను అధికారులు గుర్తించారు. అది బాంబ్ తయారీలో ఉపయోగించే పౌడర్‌గా భావిస్తున్నారు. అమ్మోనియం నైట్రేట్, క్లోరైడ్‌ల మిశ్రమమై ఉండొచ్చని చెబుతున్నారు. పేలుడు తర్వాత అక్కడ కెమికల్స్ దుర్గంధం వచ్చిందని స్థానికులు, పోలీసులు కూడా తెలిపారు. తమ బృందాలు అన్ని విషయాలను సమగ్రంగా దర్యాప్తు చేస్తుందని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పేలుడు శబ్దం వినిపించిందని, వెంటనే స్టేషన్ హౌజ్ ఆఫీసర్, బృందం స్పాట్‌కు చేరుకుందని ఆ పోలీసు అధికారి వివరించారు. స్పాట్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారని, ఆ ప్రాంతంలో ఎవరూ వచ్చి వెళ్లారో గుర్తించడానికి మొబైల్ నెట్‌వర్క్ డేటాను సేకరిస్తున్నామని తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఉగ్ర కోణాన్ని కూడా ఇప్పుడే కొట్టిపారేయలేమని వివరించారు.

Advertisement

Next Story