- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. మరో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరో సప్లిమెంటరీ చార్జిషీట్‌ను రౌస్ ఎవెన్యూ కోర్టుకు గురువారం సమర్పించింది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అరుణ్ రామచంద్ర పిళ్లయ్, లిక్కర్ వ్యాపారి అమన్‌దీప్ ధల్ పేర్లను ప్రస్తావించి.. వారిపై అభియోగాలను నమోదు చేసినట్లు తెలిసింది. ఈ చార్జిషీట్ స్పెషల్ జడ్జి ముందుకు శుక్రవారం విచారణకు రానున్నది.
ఈ ముగ్గురికీ లిక్కర్ స్కామ్‌లో ఎలాంటి ప్రమేయం ఉన్నదో ఈడీ అధికారులు ఈ చార్జిషీట్‌లో ప్రస్తావించారు. దీనిని పరిగణనలోకి తీసుకునే విషయమై స్పెషల్ జడ్జి శుక్రవారం స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నది. లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26న అరెస్టు చేయగా అదే కేసులో ఈడీ మార్చి 9న అరెస్టు చేసింది. అప్పటికే లిక్కర్ వ్యాపారి అమన్‌దీప్ ధల్‌ను మార్చి 1న అరెస్టు చేసింది. సౌత్ గ్రూపు ప్రతినిధిగా వ్యవహరించారన్న ఆరోపణలపై అరుణ్ పిళ్లయ్‌ను మార్చి 6న ఈడీ అరెస్టు చేసింది.
ఈ ముగ్గురిపై ఏప్రిల్ చివర్లో సప్లిమెంటరీ చార్జిషీట్ (ప్రాసిక్యూషన్ కంప్లైంట్)ను దాఖలు చేయనున్నట్లు రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ఈ నెల 17న జరిగిన విచారణ సందర్భంగా ఈడీ తరఫున హాజరైన న్యాయవాది నవీన్ కుమార్ మట్టా స్పష్టం చేశారు. అమన్‌దీప్ ధల్‌ను అరెస్టు చేసి 60 రోజులు కావస్తున్నందున నిబంధనల ప్రకారం చార్జిషీట్‌ను దాఖలు చేయడం ఈడీకి అనివార్యంగా మారింది.
ఇతనితో పాటు సిసోడియా, అరుణ్ పిళ్లయ్‌లను కూడా అరెస్టు చేసినందున ఈ ముగ్గురిపై ఒకేసారి సప్లిమెంటరీ చార్జిషీట్‌ను స్పెషల్ కోర్టుకు ఈడీ సమర్పించింది. ఇప్పటికే రెండు చార్జ్ షీటులను ఈడీ దాఖలు చేయగా.. ఇది మూడవది. స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌పాల్ బెంచ్ ముందు దీనిపై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. ఈ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే విషయమై పరిశీలన తర్వాత వెల్లడించే అంశాన్ని, తదుపరి తేదీని స్పెషల్ జడ్జి శుక్రవారం అనౌన్స్ చేసే అవకాశమున్నది.
సిసోడియాకు ఈడీ కేసులో స్పెషల్ కోర్టు గతంలో విధించిన జ్యుడిషియల్ కస్టడీ ఏప్రిల్ 29న ముగియనున్నందున ఒక రోజు ముందుగానే చార్జిషీట్‌పై వాదనలు జరగనుండడం గమనార్హం.