లిక్కర్ స్కాం : కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

by Hajipasha |   ( Updated:2024-03-07 12:54:18.0  )
లిక్కర్ స్కాం : కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ డుమ్మాల మీద డుమ్మాలు కొడుతున్నారు.ఈనేపథ్యంలో తాజాగా రెండోసారి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌పై ఈడీ ఫిర్యాదు చేసింది. మార్చి 4న ఎనిమిదోసారి జారీ చేసిన సమన్లను కూడా దాటవేసినందుకు కేజ్రీవాల్‌పై ఈడీ ఈ కంప్లయింట్ దాఖలు చేసింది. దీంతో ఈనెల 16న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఢిల్లీ సీఎంకు రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు తొలిసారిగా ఫిబ్రవరి 3న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ కంప్లయింట్ చేయగా.. అప్పట్లోనూ మార్చి 16న తమ ఎదుట హాజరుకావాలనే ఆదేశాలనే న్యాయస్థానం జారీ చేసింది. 2023 నవంబర్ 2 నుంచి ఈ ఏడాది మార్చి 4 వరకు ఎనిమిదిసార్లు కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈ సమన్లు రాజకీయ ప్రేరేపితమైనవని చెప్పి వాటిని ఆప్ చీఫ్ వరుసగా దాటవేస్తున్నారు. ఈనెల 16న కోర్టు ఎదుట అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారా ? హాజరైతే ఏం జరుగుతుంది ? అనే దానిపై అంతటా సస్పెన్స్ నెలకొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి ఆప్ సీనియర్ నేతలు ఈడీ కస్టడీలో ఉన్నారు.

Advertisement

Next Story