Cyclone Dana: దూసుకొస్తున్న ‘దానా’.. ఒడిశా, బెంగాల్‌లలో అలర్ట్

by vinod kumar |
Cyclone Dana: దూసుకొస్తున్న ‘దానా’.. ఒడిశా, బెంగాల్‌లలో అలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: దానా తుపాన్ బంగాళాఖాతం వైపు వేగంగా దూసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో పాఠశాలలు మూసివేయడంతో పాటు, 150కి పైగా రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 25 తెల్లవారుజామున తుపాన్ పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరాన్ని తాకనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ‘దానా’ తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తుపాను కారణంగా పూరీలో 3 వేల మందికి పైగా పర్యాటకులను తరలించారు.

ఒడిశాలోని 14 జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను 25వ తేదీ వరకు మూసివేశారు. ఉద్యోగుల సెలవులను సైతం ప్రభుత్వం రద్దు చేసింది. దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోనూ దానా తుపాన్ ప్రభావం ఉండనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏడు జిల్లాల్లోని పాఠశాలలను ఈనెల 26 వరకు మూసివేశారు. తుపానును ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్ఈఆర్) పరిధిలో నడిచే 150కి పైగా రైళ్లను అధికారులు రద్దు చేశారు.

Advertisement

Next Story

Most Viewed