ప్రచార ఘట్టానికి తెర.. జూన్ 1న తుది విడత పోలింగ్

by Hajipasha |
ప్రచార ఘట్టానికి తెర.. జూన్ 1న తుది విడత పోలింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టానికి గురువారం సాయంత్రం తెరపడింది. జూన్ 1న (శనివారం) ఏడో విడత పోలింగ్ జరగనున్న ఎనిమిది రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో మైకులు మూగబోయాయి. దీంతో ఆయా చోట్ల 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఈ వ్యవధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు ఎవరూ పాల్పడకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేక టీమ్‌లను ఎన్నికల సంఘం రంగంలోకి దింపింది. తుది విడత ఎన్నికల బరిలో ప్రధాని మోడీ సహా 598 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్‌ జరగనున్న కీలకమైన స్థానాల్లో వారణాసి (ఉత్తరప్రదేశ్) కూడా ఉంది. ఇక్కడి నుంచే ప్రధాని మోడీ వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నుంచి సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు. జూన్ 1న పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి 18వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ మొత్తం ఏడు దశల్లో 44 రోజులపాటు సాగనుంది. 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం జరుగుతున్న ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.

76 రోజులు.. 200 సభలు.. ప్రధాని మోడీ సుడిగాలి పర్యటన

ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ప్రధాని దాదాపు 200కు పైగా ర్యాలీలు నిర్వహించారు. గత 76 రోజుల్లో ప్రధాని దేశం నలుమూలలా ర్యాలీలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. 22 రోజుల పాటు రోజూ నాలుగు చోట్ల ప్రచారాలు చేపట్టారు. మూడు సార్లయితే ఒక్క రోజులోనే ఐదు సభల్లో మోడీ పాల్గొన్నారు. ఒక్క మే నెలలోనే ప్రధాని 96 ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు. ప్రధాని మోడీ చేపట్టిన ప్రచారాల్లో సగం (88 సభలు) కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 31 సభలు, బిహార్‌‌లో 20, మహారాష్ట్రలో 19, పశ్చిమ బెంగాల్‌లో 18 ప్రచార కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. దక్షిణాదిలో అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 సార్లు మోడీ ప్రచారం చేశారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని ఐదు ర్యాలీల్లోనే పాల్గొన్నారు.

Advertisement

Next Story