Govind Mohan : కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్‌ మోహన్‌.. మోడీ సర్కారు కీలక నిర్ణయం

by Hajipasha |
Govind Mohan : కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్‌ మోహన్‌.. మోడీ సర్కారు కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర హోంశాఖ తదుపరి కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గోవింద్‌ మోహన్‌ నియమితులయ్యారు. ఈయన 1989 సిక్కిం క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్న 59 ఏళ్ల గోవింద్‌ మోహన్‌‌కు కీలకమైన హోంశాఖకు కార్యదర్శిగా సేవలందించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పని చేస్తున్న అజయ్‌ కుమార్‌ భల్లా పదవీకాలం ఈ నెల 22న ముగియనుంది. ఈనెల 23న గోవింద్‌ మోహన్‌ బాధ్యతలను స్వీకరిస్తారు. అప్పటివరకు హోం వ్యవహారాల శాఖలో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ)గా ఆయన సేవలు అందిస్తారు. ఈమేరకు గోవింద్ మోహన్‌ నియామకానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ అంశంపై వెంటనే కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) ఉత్తర్వులు విడుదల చేసింది.

తొలిసవాల్ జమ్మూకశ్మీర్ పోల్స్

ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోవింద్‌ మోహన్‌ వారణాసి ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. గతంలో రెండుసార్లు కేంద్ర హోంశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈ ఏడాది మార్చి 27 నుంచే కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా గోవింద్‌ మోహన్‌‌ సేవలు అందిస్తున్నారు. అంతకుముందు ఆయన క్రీడలశాఖ కార్యదర్శిగా కొద్దికాలం పాటు సేవలందించారు. త్వరలో జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కశ్మీర్‌లో ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై మోహన్‌‌ ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సి రావచ్చు. ఎన్నికల సంఘంతో కలిసి కశ్మీర్‌లో ప్రశాంతంగా పోల్స్ నిర్వహించే బాధ్యతను కేంద్ర హోంశాఖకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed