రెండో టెస్టులో రోహిత్, కోహ్లీ ఫెయిల్.. సిరీస్ సమం చేస్తారా!.. చేజార్చుకుంటారా?

by saikumar |
రెండో టెస్టులో రోహిత్, కోహ్లీ ఫెయిల్.. సిరీస్ సమం చేస్తారా!.. చేజార్చుకుంటారా?
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌ (NEWZELAND) తో సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో టీమిండియా(INDIA) మరోసారి తడబాటుకు గురైంది. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెనుకబడ్డారు. స్పిన్ బౌలింగులో వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. అనవసరమైన చెత్త షాట్లు ఆడి కేవలం 156 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యారు. కెప్టెన్ రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లు ఉన్నా జట్టుకు మార్గనిర్దేశం చేసే వారే కరువయ్యారు. ఫలితంగా మిచెల్ సాంట్నర్ (7/53) నేటి మ్యాచులో అత్యుత్తమ గ‌ణాంకాలను నమోదు చేశాడు. అనంతరం రెండో రోజూ బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టులో కెప్టెన్ టామ్ లాథ‌మ్(86), వికెట్ కీప‌ర్ టామ్ బ్లండెల్(30 నాటౌట్)లు నెమ్మదిగా ఆడుతూ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. దీంతో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులతో వద్ద కివీస్ బ్యాటింగ్ చేస్తున్నది. ఈసారి కూడా వాషింగ్టన్ సుందర్ (4/56) మరోసారి జట్టు భారాన్ని మోయకతప్పలేదు.

చెత్త షాట్లతో జట్టుకు చేటు..

రెండో టెస్టు తొలి మ్యాచ్ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (0) డకౌట్ అవ్వగా.. రెండో రోజూ మ్యాచ్ ప్రారంభమైన తొలి సెషన్‌లో.. గిల్(30), విరాట్ కోహ్లీ(1), య‌శ‌స్వీ జైస్వాల్(30), రిష‌భ్ పంత్(18), స‌ర్ఫరాజ్ ఖాన్(11)లు వరుసగా పెవిలియన్ చేరారు. వీరిలో అనవసరపు చెత్త షాట్లు ఆడటమే వికెట్ల పతనానికి కారణం. ఇక ఇండియా 150 పరుగులు సాధించిందంటే అదంతా ర‌వీంద్ర జ‌డేజా(38), వాషింగ్టన్ సుంద‌ర్‌(18) కృషి వల్లే అని చెప్పొచ్చు.

తిప్పేసిన మిచెల్ సాంట్నర్..

తొలి రోజు సెషన్‌లో కివీస్ జట్టును భారత బౌలర్లు దెబ్బకొట్టగా.. ఆ రివెంజ్‌ను ఆ జట్టు స్పిన్ బౌలర్ మిచెల్ సాంట్నర్ తీర్చుకున్నాడు. తన పదునైన బంతులతో భారత బ్యాటర్లను ఒక్కొక్కరిగా పెవిలియన్ బాట పట్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కీలక ఆటగాళ్లను ఔట్ చేసి (7/53) మెరుగైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. స్పిన్ పిచ్‌ మీద తన ప్రతాపం ఎంటో టీమిండియా బ్యాటర్లకు రుచి చూపించాడు. ఫలితంగా 156 పరుగులకే భారత జట్టు ఆలౌట్ అయ్యింది.

ఆపద్భాందవుడిలా సుందర్..

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో న్యూజిలాండ్ న‌డ్డివిరిచిన వాషింగ్టన్ సుంద‌ర్(WASHINGTON SUNDER).. రెండో ఇన్నింగ్స్‌లో (4/56) మరోసారి వికెట్ల వేట కొన‌సాగించాడు. ఓపెన‌ర్ డెవాన్ కాన్వే(17)ను ఎల్బీగా ఔట్ చేయగా.. ఆ తర్వాత ర‌చిన్ ర‌వీంద్ర(9) , డారిల్ మిచెల్‌(18)లను సుంద‌ర్ డగౌట్ చేర్చాడు. ఓపెన‌ర్ టామ్ లాథ‌మ్(86) మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. మిచెల్ ఔట‌య్యాక టామ్ బ్లండెల్(30 నాటౌట్) తో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 60 ప‌రుగులు జోడించారు. తీరా సెంచ‌రీ దిశ‌గా దూసుకెళ్తున్న లాథ‌మ్‌ను ఎల్బీగా వెన‌క్కి పంపాడు. దీంతో సుందర్ రెండు ఇన్నింగుల్లో కలిపి 11 వికెట్ల హాల్ అందుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే స‌రికి న్యూజిలాండ్ 5 వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగులు చేసి.. తమ ఆధిక్యాన్ని 301కి పెంచుకుంది. రెండో టెస్టులో టీమిండియా ఓట‌మి నుంచి తప్పించుకోవాలంటే కివీస్ విధించే లక్ష్యాన్ని మరోసారి తప్పులు, చెత్త షాట్లు ఆడకుండా.. ఆచితూచీ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. లేకపోతే సిరీస్‌ను 2-0 తేడాతో సమర్పించుకోవాల్సి వస్తుంది. ఫలితంగా WTC చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరే మార్గం భారత్‌కు క్లిష్టతరంగా మారనుంది.

స్కోర్ బోర్డు :

భారత జట్టు (ఫస్ట్ ఇన్నింగ్స్) : 156 /10

బ్యాటింగ్ : జైస్వాల్ 30 (సి) డారిల్ మిచెల్ (బి) గ్లెన్ ఫిలిప్స్, రోహిత్ శర్మ 0 (బి) టిమ్ సౌథీ, గిల్ 30 (ఎల్బీ) సాంట్నర్, విరాట్ కోహ్లీ 1 (బి) సాంట్నర్, రిషబ్ పంత్ 18 (బి) ఫిలిప్స్, సర్ఫరాజ్ ఖాన్ 11 (సి) విల్ (బి) సాంట్నర్, రవీంద్ర జడేజా 38 (ఎల్బీ) (బి) సాంట్నర్, అశ్విన్ 4 (ఎల్బీ) (బి) సాంట్నర్, సుందర్ 18 (నాటౌట్), ఆకాశ్ దీప్ 6 (బి) సాంట్నర్, బుమ్రా 0 (బి) సాంట్నర్ , ఎక్స్‌ట్రాలు : 0

వికెట్ల పతనం : 1/1,50/2,56/3,70/4,83/5,95/6,103/7,136/8,142/9,156/10

బౌలింగ్ : టిమ్ సౌథీ (6-1-18-1), విల్ రౌర్కీ (3-2-5-0), అజాజ్ పటేల్ (11-0-54-0), మిచెల్ సాంట్నర్ (19.3-1-53-7), గ్లెన్ ఫిలిప్స్ (6-0-26-2)

న్యూజిలాండ్ ( రెండో ఇన్నింగ్స్) : 198/5 (53 ఓవర్స్)

బ్యాటింగ్ : టామ్ లాథమ్ 86 (ఎల్బీ) (బి) సుందర్, డేవాన్ కాన్వే 17 (ఎల్బీ) (బి) సుందర్, విల్ యాంగ్ 23 (ఎల్బీ) (బి) అశ్విన్ , రచిన్ రవీంద్ర 9 (బి) సుందర్, డారిల్ మిచెల్ 18 (సి) జైస్వాల్ (బి) సుందర్, టామ్ బ్లండెల్ 30 (నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ 9 (నాటౌట్) ఎక్స్‌ట్రాలు : 6

వికెట్ల పతనం : 36/1,78/2,89/3,123/4,183/5

బౌలింగ్ : రవిచంద్రన్ అశ్విన్ (17-1-64-1), సుందర్ (19-0-56-4), జడేజా (11-1-50-0), బుమ్రా (6-1-25-0)

Advertisement

Next Story

Most Viewed