మొన్న కొవిషీల్డ్.. ఇప్పుడు కొవాగ్జిన్.. బనారస్ వర్సిటీ సంచలన నివేదిక

by Hajipasha |   ( Updated:2024-05-16 18:57:26.0  )
మొన్న కొవిషీల్డ్.. ఇప్పుడు కొవాగ్జిన్.. బనారస్ వర్సిటీ సంచలన నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో : మన దేశంలో అత్యధికంగా విక్రయాలను సాధించిన కరోనా వ్యాక్సిన్లు కొవాగ్జిన్, కొవిషీల్డ్. కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా) వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయని ఇప్పటికే ఆస్ట్రాజెనెకా కంపెనీ అంగీకరించింది. ఆ కంపెనీ ఇకపై తమ కరోనా టీకాలను విక్రయించబోమని ప్రకటించింది. తాజాగా కొవాగ్జిన్‌పై ఓ సంచలన అధ్యయన నివేదిక బయటికి వచ్చింది. ఈ టీకాను మన హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసింది. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు దీన్ని సప్లై చేశారు.

ఈ కొవాగ్జిన్ కరోనా టీకాతో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఆందోళన రేకెత్తించే అంశాలు వెలుగుచూశాయి. 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్ద వయస్కులపై ఏడాది పాటు కొవాగ్జిన్ టీకాతో ట్రయల్స్ నిర్వహించగా పలువురిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. టీనేజర్ల కేటగిరీలోని 304 (47.9 శాతం) మందిలో, పెద్ద వయస్కుల కేటగిరీకి చెందిన 124 (42.6 శాతం) మందిలో వైరల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (శ్వాసకోశ సమస్య)లను పరిశోధకులు గుర్తించారు. ఈ రెండు విభాగాలకు చెందిన పలువురు మహిళల్లో కొవాగ్జిన్ సైడ్ ఎఫెక్టు కారణంగా రుతుక్రమ సమస్యలు తలెత్తాయి. మహిళల్లో 2.7 శాతం మందికి కంటిచూపు సమస్యలు, 10.5 శాతం మందికి చర్మ సమస్యలు, 4.7 శాతం మందికి నరాల సంబంధిత సమస్యలు వచ్చాయని అధ్యయనంలో గుర్తించారు. ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల అతికొద్ది మందికి అనాలిలాక్సిస్, మయోకార్డిటిస్, త్రోంబోసిస్ (రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం) వంటి సమస్యలు వచ్చాయి. ఇందులోనే కొన్ని కేసుల్లో బ్రెయిన్ స్ట్రోక్, గులియన్‌-బారే సిండ్రోమ్ వంటి సమస్యలు తలెత్తాయి.

భారత్ బయోటెక్ ఏం చెప్పిందంటే..

కొవాగ్జిన్ కరోనా టీకా అత్యంత సురక్షితమైందని భారత్ బయోటెక్ కంపెనీ గురువారం పునరుద్ఘాటించింది. గతంలోనూ కొవాగ్జిన్‌పై అనే అధ్యయనాలు జరిగాయని, ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదని ఆ నివేదికలన్నీ తేల్చి చెప్పాయని గుర్తు చేసింది. ఇక బనారస్ హిందూ యూనివర్సిటీ అధ్యయన నివేదికపై భారత్ బయోటెక్ స్పందిస్తూ.. ‘‘వ్యాక్సిన్‌తో ఎవరిపైనైతే ట్రయల్స్‌ను చేస్తామో.. అంతకంటే ముందువారి ఆరోగ్య వివరాలను సేకరించాలి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారిపైనే ట్రయల్ జరపాలి. ఈ నిబంధనను పాటించకుండా నేరుగా టీకా ట్రయల్స్ జరిపితే.. వారిలో తీరొక్క సైడ్ ఎఫెక్టులు బయటపడతాయి’’ అని పేర్కొంది. ‘‘టీకాలు తీసుకోని వారిని ఒక గ్రూపుగా.. టీకాలు తీసుకున్న వారిని ఒక గ్రూపుగా.. ఇతర కంపెనీల టీకాలు తీసుకున్న వారిని మరో గ్రూపుగా విభజించి ట్రయల్స్ ఫలితాలను తులనాత్మకంగా విశ్లేషించాల్సి ఉంటుంది’’ అని భారత్ బయోటెక్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed