మూడు రోజుల పోలీసు కస్టడీకి బిభవ్ కుమార్‌

by Harish |
మూడు రోజుల పోలీసు కస్టడీకి బిభవ్ కుమార్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడిన కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం మళ్లీ మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. నాలుగు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఆయన్ను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టారు. తాజాగా మరో మూడు రోజుల పోలీసు కస్టడీకి కోరగా ఇరుపక్షాల వాదనలు విన్న మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మూడు రోజుల(మే 31 వరకు) కస్టడీకి అనుమతించింది. అంతకుముందు ఇదే కేసులో బెయిల్ కోసం వేసిన పిటిషన్‌‌ను కోర్టు కొట్టివేసింది. సోమవారం విచారణ సందర్భంగా హాజరైన స్వాతి మలివాల్ తనకు బెదిరింపులు వస్తున్నాయని నిందితునికి బెయిల్ ఇవ్వద్దని వాదించారు. బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత, మెట్రోపాలిటన్ కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా బిభవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే తెలిపింది.

మే 13న కేజ్రీవాల్‌ను కలిసేందుకు స్వాతి మలివాల్‌ ఆయన ఇంటికి వెళ్లినప్పుడు బిభవ్ కుమార్‌ దాడికి పాల్పడ్డాడని ప్రధాన ఆరోపణ. ఇది దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఎన్నికల జరుగుతున్న తరుణంలో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో మే 18న కుమార్‌ని అరెస్టు చేశారు. ఆయనపై భారతీయ శిక్షాస్మృతిలోని బెదిరింపుకు పాల్పడటం, దాడి చేయడం, మహిళను వేధించడం, నేరపూరిత హత్యకు ప్రయత్నించడం వంటి నిబంధనల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Advertisement

Next Story