సెక్స్ కుంభకోణం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్ కోసం సెర్చ్ ఆపరేషన్

by Shamantha N |
సెక్స్ కుంభకోణం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్ కోసం సెర్చ్ ఆపరేషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఫోన్ ఎక్కడుందనేది సవాలుగా మారింది. ఈ ఫోన్ ద్వారానే మాజీ జేడీఎస్ నేత ప్రజ్వల్ మహిళలతో శృంగార వీడియోలను చిత్రీకరించాడని అధికారులు భావిస్తున్నారు. వీడియోలు రికార్డు చేయడానికి ప్రాథమికంగా ఫోన్ వాడినట్లు తెలుస్తోంది. అయితే, ఫోన్ గురించి ప్రజ్వల్ ను ప్రశ్నించగా.. ఏడాది క్రితం తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నానని తెలిపారు. తాను ఫోన్ పోగొట్టుకున్నప్పుడు హోలెనరసిహూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని వివరించారు. కేఎస్పీ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసులో ఫోన్ కీలకంగా మారడంతో, ప్రజ్వల్ రేవణ్ణ ఫిర్యాదు గురించి హోలెనరసిహూర్ పోలీస్ స్టేషన్‌ని సిట్ సంప్రదించింది. ఫోన్ పోగొట్టుకున్న కేసులో నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ నమోదు చేసినట్లు పోలీసులు సిట్‌కు తెలిపారు. అయితే, మొబైల్ ఫోన్ ని గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఐఎంఈఐ నంబర్ తో ఫోన్ ను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. వీడియోలను రికార్డ్ చేసిన ఫోన్ ని గుర్తించడంలో అధికారులు విఫలమైతే ‘‘సాక్ష్యాలు ట్యాంపరింగ్’’ చేశాడని ప్రజ్వల్ పై అదనపు అభియోగాలు మోపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ నెలలో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హసన్ జిల్లాలో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆయనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పాటు రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపులు కేసు పెట్టింది. ఆ తర్వాత పరిణామాల్లో ప్రజ్వల్ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లిపోయాడు. మే 31 విచారణకు హాజరవుతానని ప్రజ్వల్ వీడియో సందేశాన్ని పెట్టారు. దీంతో మహిళా పోలీసుల బృందం బెంగళూరు ఎయిర్ పోర్టులో ఆయన్ని అరెస్టు చేసింది. వెంటనే ప్రజ్వల్‌ను బెంగళూరు కోర్టులో ప్రవేశపెట్టగా.. జూన్‌ 6 వరకు కస్టడీకి పంపింది.

Advertisement

Next Story