కర్ణాటక 'ఖాళీ చెంబు' రాజకీయం

by S Gopi |
కర్ణాటక ఖాళీ చెంబు రాజకీయం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేడి మరింత పెరుగుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య మాటలు కూడా అంతే స్థాయిలో భగ్గుమటున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య 'ఖాళీ చెంబు రాజకీయం అతిపెద్ద చర్చకు దారితీసింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి ఖాళీ చెంబు తప్పించి ఏమీ ఇవ్వలేదని కాంగ్రెస్ ఓ యాడ్‌ను రూపొందించింది. దీంతో ఈ యాడ్ సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య విమర్శల యుద్ధానికి కారణమైంది. ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ, జేడీఎస్ అధినేత దేవెగౌడ ఓ సభలో కూర్చొని ఉండగా, ఆయన చేతిలో ఉన్న పత్రిక మొదటి పేజీలో కాంగ్రెస్ ఇచ్చిన ఖాళీ చెంబు యాడ్ ఉన్న ఫోటోనో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆ యాడ్‌లో దేవెగౌడ ఆర్ట్‌ను ఆర్టిస్టు(మోడీ)కి చూపుతున్నట్టు క్యాప్షన్ పెట్టారు. దీనిపై స్పందించిన బీజేపీ కాంగ్రెస్‌కు కౌంటర్‌గా 2013లో సిద్ధరామయ్య చెంబు పట్టుకుని ఉన్నట్టు, 2023లో ఆ చెంబు లేనట్టు ఎడిట్ చేసిన ఫోటోను బీజేపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. దీనికి 'తేడా స్పష్టంగా కనిపిస్తోందని' క్యాప్షన్ ఉంచింది.

అనంతరం ఈ అంశం సోషల్ మీడియా నుంచి బహిరంగ విమర్శలకు తెరలేపింది. కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా ఖాళీ చెంబుతో నిరసన తెలిపుతున్న ఫోటోలను ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలు, రాష్ట్ర డిమాండ్లను బీజేపీ పట్టించుకోలేదని ఆరోపించారు. కర్ణాటక ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో రూ. 100 ఇస్తుంటే, కేంద్రం తిరిగి కేవలం రూ. 13 ఇస్తోంది. మా పన్నుల సొమ్ము ఇవ్వమని డిమాండ్ చేస్తే, ప్రధాని మోడీ ఖాళీ చెంబు ఇచ్చారు. కర్ణాటకలోని రైతులు, పేదల కొసం కరువు నిధులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే ఖాళీ చెంబు మా చేతిలో పెట్టారని రణదీప్ సూర్జేవాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరున్నత కోట్ల మంది కన్నడిగులు కూడా బీజేపీ పార్టీకి అదే చెంబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారికి ఈ చెంబులన్నీ ఇచ్చి ఇంటికి పంపుతారు' అని ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

Next Story