Congress : జ్యుడీషియల్ కస్టడీ నిబంధనలు తూచ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు బాగోతం వెలుగులోకి

by Hajipasha |
Congress : జ్యుడీషియల్ కస్టడీ నిబంధనలు తూచ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు బాగోతం వెలుగులోకి
X

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ (అక్టోబరు 5) సమీపించిన వేళ సమల్ఖా స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యే‌ ధరం సింగ్ చోకర్‌కు షాక్ తగిలింది. దాదాపు రూ.400 కోట్ల రియల్ ఎస్టేట్ స్కాం కేసులో ఈ ఏడాది మార్చిలోనే అరెస్టయిన ఎమ్మెల్యే కుమారుడు సికందర్ సింగ్ ఈడీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆరోగ్యం బాగా లేదనే సాకుతో అతడు కోర్టు నుంచి అనుమతి పొంది గతనెల రోజులుగా రోహ్‌తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నాడు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున చికిత్స పొందే క్రమంలో అతడు ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే నిబంధనలను పక్కనపెట్టి ఎమ్మెల్యే కుమారుడు సికందర్ సింగ్ ఆస్పత్రి బయట దర్జాగా తిరుగుతుండటాన్ని సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈడీ అధికారులు గుర్తించారు.

అతడి ఆరోగ్యం బాగానే ఉందని, జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా జైలులో ఉండలేక.. చికిత్స పేరుతో ఆస్పత్రుల్లో చేరి ఊరంతా తిరుగుతున్నాడని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తండ్రి ధరం సింగ్ చోకర్‌ తరఫున కూడా సికందర్ సింగ్ ప్రచారం చేశాడని పేర్కొన్నారు. ఈమేరకు వివరాలను ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించినట్లు తెలిసింది. రూ.400 కోట్ల రియల్ ఎస్టేట్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఎమ్మెల్యే ధరం సింగ్ చోకర్ ఉన్నారు. ధరం సింగ్, ఆయన కుమారుడు సికందర్ సింగ్‌లు కలిసి గురుగ్రామ్ ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును ప్రారంభించి వందలాది మందిని కోట్లాది రూపాయలు మేర మోసగించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ధరం సింగ్ 24 గంటల్లోగా లొంగిపోకుంటే అరెస్టు చేయాలని ఇటీవలే పంజాబ్ హర్యానా హైకోర్టు ఈడీ, హర్యానా పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ పరిణామం చోటుచేసుకున్న వెంటనే ఇప్పుడు ఎమ్మెల్యే కుమారుడి బాగోతాన్ని ఈడీ బయటపెట్టడం గమనార్హం.

Next Story

Most Viewed