కాంగ్రెస్, జేఎంఎంలు జార్ఖండ్‌ను దోచుకున్నాయి: ప్రధాని మోడీ విమర్శలు

by samatah |
కాంగ్రెస్, జేఎంఎంలు జార్ఖండ్‌ను దోచుకున్నాయి: ప్రధాని మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీలపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలకు అభివృద్ధి అంటే ఏంటో తెలియదని కేవలం దోచుకోవడం మాత్రమే తెలుసని ఆరోపించారు. జార్ఖండ్‌లోని జంషెడ్ పూర్‌లో ఆదివారం ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా ప్రసంగించారు. ‘కాంగ్రెస్, జేఎంఎంలకు అభివృద్ధి గురించి ఏమీ తెలియదు. అబద్ధాలు చెప్పడం. పదే పదే బిగ్గరగా మాట్లాడటం వారి ఏకైక పని. అంతేగాక పేదల సంపదను దోచుకోవడమే వారి లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు.

ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను లాక్కునేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రతి రోజూ మోడీపై దుర్భాషలాడుతున్నారని చెప్పారు. జార్ఖండ్ ఎంతో సంపన్నమైన రాష్ట్రం అయినప్పటికీ ప్రస్తుతం బలహీనంగా మారిందని తెలిపారు. జేఎంఎం-కాంగ్రెస్ తమ ఖజానాను మాత్రమే నింపుకున్నాయని, రాష్ట్రం పేరు వినగానే నోట్ల కట్టలు గుర్తుకొస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు. జంషెడ్ పూర్‌లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story