Lightning Strike : పిడుగుపాటుకు ఎనిమిది మంది బలి.. మృతుల్లో ఆరుగురు పిల్లలు

by Hajipasha |
Lightning Strike : పిడుగుపాటుకు ఎనిమిది మంది బలి..  మృతుల్లో ఆరుగురు పిల్లలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో పిడుగుపాటుకు 8 మంది బలయ్యారు. చనిపోయిన వారిలో ఆరుగురు పిల్లలు కూడా ఉండటం అందరినీ కలచివేసింది. జోరతరై గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో ఐదుగురు పిల్లలు స్కూలు నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తుండగా ఈ విపత్తు అలుముకోవడం విషాదకరం. అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో ఐదుగురు స్కూలు పిల్లలు, మరో నలుగురు ఓ చెట్టు కింద ఉన్న షెడ్డులో నిల్చున్నారు. అయితే సరిగ్గా దానిపైనే పిడుగు పడింది. దీంతో షెడ్డులో తలదాచుకున్న వారిలో ఎనిమిది మంది చనిపోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఐదుగురు స్కూలు విద్యార్థులు ఎనిమిది నుంచి పన్నెండేళ్లలోపు వారు. ఈవివరాలను రాజ్‌నంద్‌గావ్ జిల్లా ఎస్పీ మోహిత్ గార్గ్ మీడియాకు వెల్లడించారు. చనిపోయిన వారంతా మూడు వేర్వేరు గ్రామాలకు చెందినవారని తెలిపారు.

ఈ ఘటనలో ప్రాాణాలు కోల్పోయిన పిల్లలు ముధపర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవారని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందన్నారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన ఎనిమిది మంది కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ఆర్థికసాయాన్ని అందిస్తామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వెల్లడించారు. ఈ విషాదం గురించి తెలిసి తాను చాలా ఆవేదనకు లోనయ్యానని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా సీఎం ఒక పోస్ట్ చేశారు.

Next Story

Most Viewed