చిరాగ్ పాశ్వాన్‌కు షాక్..22 మంది నేతల రాజీనామా: ఇండియా కూటమికి మద్దతు!

by samatah |
చిరాగ్ పాశ్వాన్‌కు షాక్..22 మంది నేతల రాజీనామా: ఇండియా కూటమికి మద్దతు!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అత్యంత సీనియర్ నేతలు సైతం తమ సొంత పార్టీలో టికెట్లు దక్కకపోవడంతో పార్టీలు మారి టికెట్లు పొందుతున్నారు. తాజాగా బిహార్‌లో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) ఎల్‌జేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 22మంది కీలక నేతలు రిజైన్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో టికెట్ దక్కనందునే రాజీనామా చేసినట్టు వారు స్పష్టం చేశారు. పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అన్ని లోక్‌సభ టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీకి రిజైన్ చేసిన వారిలో మాజీ మంత్రి రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, ఎల్‌జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్, రవీంద్ర సింగ్, అజయ్ కుష్వాహ, సంజయ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ డాంగి ఇతర ప్రముఖ నేతలు ఉన్నారు. పాశ్వాన్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే వీరంతా రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

చిరాగ్ తీరుపై తీవ్ర ఆగ్రహం

ఎల్‌జేపీ మాజీ ఎంపీ రేణు కుష్వాహ పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడిస్తూ..పాశ్వాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటి వ్యక్తులకు టికెట్లు ఎందుకిచ్చారని పార్టీలో సమర్థవంతులు లేరా అని ప్రశ్నించారు. పార్టీలో కూలీలుగా పని చేయడానికి సిద్ధంగా లేమని వెల్లడించారు. ఎంపీ టికెట్లు కేటాయించే సమయంలో పార్టీ సీనియర్ నేతలతో చిరాగ్ సందప్రదింపులు జరపలేదని ఇతర నేతలు ఆరోపించారు. ఎల్‌జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్ మాట్లాడుతూ..తిరుగుబాటు నేతలు ఇండియా కూటమికి మద్దతు తెలుపుతారని తెలిపారు. దేశంలో ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్న టైంలో ఎల్‌జేపీ అధిష్టానం వ్యవహరించిన తీరు సరిగా లేదని మండిపడ్డారు. చిరాగ్ బిహార్ ప్రజలకు ద్రోహం చేశారని ఆరోపించారు.

కాగా, బిహార్‌లో బీజేపీ 17 స్థానాల్లో, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) 16, జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా (హెచ్‌ఏఎం), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి. వైశాలి, హాజీపూర్, సమస్తిపూర్, ఖగారియా, జముయి సెగ్మెంట్లలో ఎల్‌జేపీ పోటీ చేస్తోంది. అయితే సమస్తీ పూర్ నుంచి శాంబవి చౌదరి, ఖగారియా నుంచి రాజేశ్ వర్మ, వైశాలిలో వీణాదేవిలు ఎల్‌జేపీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వీరికి టికెట్లు కేటాయించడంతోనే పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. పాశ్వాన్ ఈ సీట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. ఇక, హజీపూర్ నుంచి చిరాగ్ పాశ్వాన్ పోటీ చేస్తుండగా..ఆయనకు అత్యంత సన్నిహితుడైన అరుణ్ భారతీ జమయీ నుంచి బరిలో నిలిచారు.

Advertisement

Next Story

Most Viewed