China: ఎల్ఏసీలో ప్రతిష్టంభన ముగిసింది.. భారత్‌తో ఒప్పందాన్ని ధ్రువీకరించిన చైనా

by vinod kumar |
China: ఎల్ఏసీలో ప్రతిష్టంభన ముగిసింది.. భారత్‌తో ఒప్పందాన్ని ధ్రువీకరించిన చైనా
X

దిశ, నేషనల్ బ్యూరో: తూర్పు లడఖ్‌లో రెండు సైన్యాల మధ్య ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చైనా ధ్రువీకరించింది. డ్రాగన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ మీడియా సమావేశంలో భాగంగా వివాదాస్పద ప్రాంతాల్లో సరిహద్దు పెట్రోలింగ్‌పై చైనా, భారత్ మధ్య కుదిరిన అగ్రిమెంట్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా చైనా-భారత్ సరిహద్దులో నెలకొన్న సమస్యలపై చర్చించాం. ప్రస్తుతం ఎల్ఏసీ వద్ద ఉన్న సమస్యలు పరిష్కారానికి చేరుకున్నాయి. తాజా ప్రతిపాదనను అమలు చేసేందుకు చైనా ఇండియాతో కలిసి పనిచేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. అయితే ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పంద వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

అంతకుముందు వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై భారత్, చైనాల మధ్య ఒప్పందం జరిగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. 2020లో ఈ ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలకు పరిష్కారం లభించిందని చెప్పారు. చైనాతో సైనిక, దౌత్యపరంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. సుధీర్ఘ చర్చల అనంతరం భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో పెట్రోలింగ్ ఏర్పాటుకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం దీనిపై స్పందించారు. ఎల్ఏసీ వద్ద పరిష్కారం లభించడం శుభపరిణామమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే చైనా సైతం అధికారికంగా ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించింది.

కాగా, 2020 జూన్‌లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఎల్ఏసీ వద్ద రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తాజాగా జరిగిన ఒప్పందం వల్ల 2020 ముందు ఉన్న సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed