ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంట‌ర్‌ లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. అగ్ర నేత మృతి

by M.Rajitha |
ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంట‌ర్‌ లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. అగ్ర నేత మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఈనెల 3న ఛత్తీస్‌ఘడ్ (Chhattisghar) లోని దంతెవాడ, బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంట‌ర్‌ లో 9 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంట‌ర్‌ లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేత దాదా రణధీర్ అలియాస్ ఏసోబు అలియాస్ జగన్ సహ ఆరుగురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. హన్మకొండ జిల్లా టేకులగూడెం గ్రామానికి చెందిన రణధీర్ అలియాస్ జగన్ 1980లో పార్టీలో చేరి, తొలితరం నేతగా పేరు పొందారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జిగా కీలక బాధ్యతలు పోషించారు. రణధీర్ అలియాస్ జగన్ మీద రూ.25 లక్షల రివార్డ్ ఉంది.

ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల వివరాలను దంతెవాడ ఎస్పీ, బస్తర్ రేంజ్ ఐజీ మీడియాకు విడుదల చేశారు. వారి వివరాలు.. రణధీర్ అలియాస్ జగన్, కుమారి శాంతి, సుశీల మదకామ, గంగీ ముచాకి, కోస మాధవి, లలిత, కవిత, హిద్మె మదకామ, కమలేశ్. వీరంతా పశ్చిమ బస్తర్, దర్భ డివిజన్, పీఎల్జీఏ కంపెనీ-2 కు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలం నుండి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, కిట్ బ్యాగులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే వీరిలో హిద్మె, కమలేశ్ ల మీద రూ.2 లక్షల రివార్డు ఉండగా, రణధీర్ మీద రూ.25 లక్షల రివార్డ్ ఉంది. మిగిలిన ఒక్కొక్కరి మీద రూ.5 లక్షల రివార్డులు ఉన్నాయి. మృతి చెందిన మావోయిస్టు కుటుంబాల్లో, వారి గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఈ ఘటనతో ఈ ఒక్క ఏడాదిలోనే 154 మంది మావోయిస్టులు భద్రతా బలగాల ఎన్‌కౌంట‌ర్‌ లో మరణించారని, త్వరలోనే నక్సలిజం పూర్తిగా అంతం అవుతుందని ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి అన్నారు.

Next Story

Most Viewed