మ‌రో మృత‌దేహం భుజ‌మెక్కింది.. మాన‌వ‌త్వం సిగ్గుప‌డేలా 10కి.మీ న‌డిపించింది..?!

by Sumithra |
మ‌రో మృత‌దేహం భుజ‌మెక్కింది.. మాన‌వ‌త్వం సిగ్గుప‌డేలా 10కి.మీ న‌డిపించింది..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః భార‌త‌దేశం ప్ర‌పంచ దేశాల‌కు దిశానిర్థేశం చేస్తోందంటూ మ‌నోళ్లు తెగ చంక‌లు గుద్దుకునే సంద‌ర్భాలు చాలానే చూస్తున్నాం. ఆర్థిక‌, సాంకేతిక అభివృద్ధిలో అగ్ర‌దేశాల‌కు ధీటుగా దూసుకుపోతున్నామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నాము. కానీ, దేశంలో ఆరోగ్య సంర‌క్ష‌ణ శాఖ ప‌నితీరు 'పేరు గొప్ప ఊరు దిబ్బ' చందంలో ఉంది. లేక‌పోతే, ప్రాణంగా పెంచుకున్న క‌న్న‌బిడ్డ అనారోగ్యంతో చ‌నిపోతే, క‌ళ్ల నిండా నీరు, గుండె నిండా బాధ‌తో పాటు బిడ్డ శ‌వాన్ని కూడా మోసుకొని, ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఓ సామాన్య భార‌తీయుడికే ఏందుకొస్తుంది..?! ఈ దేశంలో ఇది కొత్త‌గా కనిపించిన వాస్త‌వం కాదు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు త‌ర‌చుగానే క‌నిపిస్తున్నాయి. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఓ వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తె మృతదేహాన్ని భుజాలపై మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

జిల్లాలోని లఖన్‌పూర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం ఓ బాలిక అనారోగ్యంతో మృతి చెందగా, అక్క‌డ దేహాన్ని తీసుకెళ్లే ప్ర‌భుత్వ వాహ‌నం అందుబాటులో లేక‌పోవ‌డంతో, ప్ర‌యివేటు వాహ‌నంలో తీసుకెళ్లే స్థోమ‌త ఆ బీద తండ్రిది కాక‌పోవ‌డంతో, బిడ్డ మృత‌దేహాన్ని భుజాల‌పై మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. అధికారులు తెలిపిని వివ‌రాల‌ను బ‌ట్టి, ఆమదాల గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ అనారోగ్యంతో ఉన్న తన కుమార్తె సురేఖను తెల్లవారుజామున లఖన్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చాడు. తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న బాలిక‌కు ఆక్సిజన్ స్థాయిలు ప‌డిపోయాయి. చికిత్స ప్రారంభించినప్ప‌టికీ, ఆమె పరిస్థితి క్షీణించి. ఉదయం 7:30 గంటలకు మరణించింది. అయితే, మృత‌దేహాన్ని తీసుకెళ్ల‌డానికి ప్ర‌భుత్వ వాహ‌నం ఉదయం 9:30 గంటలకు వ‌స్తుంద‌ని ఆసుప‌త్రి సిబ్బంది చెప్ప‌డంతో చేసేది లేక‌, 10 కి.మీ. దూరంలో ఉన్న త‌న ఇంటికి కాలిన‌డ‌క‌నే వెళ్లాల్సి వ‌చ్చింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవ్వ‌డంతో, శుక్రవారం జిల్లా కేంద్రమైన అంబికాపూర్‌లో ఉన్న ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ డియో, ఈ విషయంపై ఆరా తీశారు. 'చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న' మాదిరి ఆరోగ్య మంత్రి ఈ సంఘ‌ట‌న‌పై విచారణకు ఆదేశించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌ను కోరారు.

Advertisement

Next Story

Most Viewed