ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగింపుపై.. మళ్లీ సుప్రీంకు కేంద్రం

by Vinod kumar |   ( Updated:2023-07-26 11:11:21.0  )
ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగింపుపై.. మళ్లీ సుప్రీంకు కేంద్రం
X

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చీఫ్‌ సంజయ్‌ మిశ్రా పదవీ కాలాన్ని మరోసారి పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. పదవీకాలాన్ని ఇక పొడిగించేది లేదని, జులై 31లోగా కొత్త ఈడీ చీఫ్‌‌ను ఎంపిక చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఈడీ చీఫ్‌ సంజయ్‌ మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా కోరారు. ఈ పిటిషన్‌ను గురువారం లిస్ట్‌ చేసేందుకు జస్టిస్ గవాయ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.

ఈడీ చీఫ్‌గా 2018 నవంబర్‌‌లో సంజయ్‌ కుమార్‌ మిశ్రా నియమితులయ్యారు. రెండేళ్ల తర్వాత (60 ఏళ్ల వయసు వచ్చిన) ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, 2020 నవంబర్‌‌లో ఆయన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అనంతరం 2022లోనూ మూడోసారి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నేత జయా ఠాకూర్‌తోపాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు సంజయ్‌ మిశ్రా పొడిగింపు కుదరదని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed