కళాశాల ప్రాంగణంలో మందుబాబుల వీరంగం..అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..

by Aamani |
కళాశాల ప్రాంగణంలో మందుబాబుల వీరంగం..అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..
X

దిశ,నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ నియోజకవర్గం నందికొండ మున్సిపాలిటీ కేంద్రంలో మందుబాబులకు ప్రభుత్వ పాఠశాల, కళాశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పాఠశాల కళాశాల కు సెక్యూరిటీ లేకపోవడంతో మందుబాబులు కళాశాలకు వచ్చి మద్యం సేవించి ఖాళీ సీసాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో పాఠశాల విద్యార్థులు వాటిని చూసి అవాక్కయ్యారు. విద్యాలయాల్లో వసతుల కల్పన, ఉత్తమ బోధన మాటెలావున్నా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. పాఠశాల, కళాశాల ప్రాంగణాలు మద్యం సీసాలు, నీటి బాటిళ్లతో తాగి పడేసిన ప్లాస్టిక్‌ గ్లాసులతో దర్శనమిస్తున్నాయి.

దేవాలయాల్లా భావించే విద్యాలయాల్లో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నా అడ్డుకునేవాడే లేడని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో కొంతకాలంగా అసాంఘిక కార్య క్ర మాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మద్యం బాబులు ఆటస్థలంలో, తరగతి గదుల వరండాలో, రాత్రివేళ నిత్యం మద్యం సేవిస్తున్నారు. తాగిన తర్వాత ఖాళీ సీసాలు, గ్లాసులు, నీటి బాటిళ్లు, తినుబండారాల వ్యర్థాలను అక్కడే వదిలి వెళ్తున్నారు.

మద్యం తాగిన అనంతరం గ్లాసులు, సీసాలను గోడను ఆనుకొని ఉన్న పాఠశాల ప్రాంగణం లోకి విసిరేస్తున్నారు.దీంతో పాఠశాల, కళాశాల ప్రాంగణం మద్యం సీసాలు, గ్లాసులతో దర్శనమిస్తున్నాయి. విద్యాలయ ప్రాంగణంలో మద్యంసీసాలు, తాగిన గ్లాసులు ఉన్నా కళాశాల ప్రిన్సిపా ల్‌, ఉన్నతపాఠశాల హెచ్‌ఎం మౌనంగా ఉంటున్నారే తప్ప మద్యం సేవిస్తున్న వారిని ప్రశ్నించకపోగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో మందు బాబులు విద్యాలయాన్ని అడ్డాగా మార్చుకున్నారు. గతంలో జిల్లాలోనే ఉత్తమ విద్యాలయం గా పేరొందిన కళాశాల, ఉన్నత పాఠశాల నేడు సమస్యలతో సతమవుతూ విద్యార్థుల సంఖ్య ఆశించినంతగా లేదు. ఈ ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా అడ్డుకట్ట వేసే వారు లేక పోవడంతో విద్యార్థులు సైతం చెడు వ్యసనాలకు బానిసలవుతారేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధు లు, పోలీస్‌ శాఖ స్పందించి నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠశాల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించ కుండా, పాఠశాల ప్రాంగణంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలనీ వాసులు కోరుతున్నారు.

పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి : రాజశేఖర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్

నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునేందుకు వందలాది మంది విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తారు. అయితే ఈ కళాశాలలకు రాత్రివేళ కాపలాదారులు లేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. సాయంత్రం తర్వాత కళాశాలలో ప్రాంగణం ఖాళీగా ఉండటంతో బయట వ్యక్తులతో పాటు ఆకతాయిలు ఇష్టానుసారం ఇక్కడికి వస్తున్నారు. పోలీస్ అధికారులు స్పందించి రాత్రివేళ ప్రభుత్వ కళాశాలలో పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించి, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రిన్సిపాల్ కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed