సమయానికి రారు.. సమస్యలు తీర్చరూ..ప్రజావాణి రోజు కూడా అదే వైఖరి

by Aamani |
సమయానికి రారు.. సమస్యలు తీర్చరూ..ప్రజావాణి రోజు కూడా అదే వైఖరి
X

దిశ, శేరిలింగంపల్లి : అసలే సోమవారం.. ప్రజా విజ్ఞప్తుల దినం.( ప్రజావాణి) సమయం 10.30 అయిపోయింది. ఆయా సమస్యలతో ప్రజలు చందానగర్ సర్కిల్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. కానీ ఒక్క అధికారి కానీ కిందిస్థాయి సిబ్బంది కానీ ఇంకా కార్యాలయానికి రాలేదు. సర్కిల్ డీసీ మాత్రం ఉదయం 8.30 నిమిషాలకు వచ్చి సీట్లో కూర్చున్నారు. మిగతా అధికారులు, సిబ్బంది మాత్రం సమయం గడిచిపోతున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా కార్యాలయానికి చేరుకోలేదు. ఉదయం 10.45 దాటుతున్నా అటెండెన్స్ రిజిస్ట్రార్ లో ఒక్కరి సంతకం లేదు. ఇంజనీరింగ్ సెక్షన్ తో పాటు అన్ని సెక్షన్లలోనూ కుర్చీలు సార్ల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రజలు కార్యాలయం బయట పెద్ద సార్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కానీ పట్టించుకునే నాథుడు లేడు.

సారొస్తారొస్తారు.. !

జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఇంజనీరింగ్, ఫుడ్ సేఫ్టీ, ఎంటమాలజీ, బర్త్ అండ్ డెత్, ట్రాన్స్పోర్ట్, ట్రేడ్, స్ట్రీట్ లైట్స్, బయోడైవర్సిటీ, స్వయం సహాయక సంఘాలు, యానిమల్ హస్బండ్రీ, ఫైర్ సేఫ్టీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఆడిట్ అండ్ అకౌంట్స్, సీడబ్ల్యూ ఓ శాఖలతో పాటు పలు శాఖలు ఉంటాయి. కానీ ఒక్క సెక్షన్ లోనూ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. సోమవారం 10.45 నిమిషాలు దాటిన

కుర్చీలు అన్ని ఖాళీగా దర్శనం ఇచ్చాయి. అదేంటి సార్లు రాలేదా అని అక్కడ ఉన్న వారిని అడిగితే సార్లు వచ్చేసరికి సమయం పడుతుందని, 11 గంటల తర్వాత మెల్లగా వస్తారని చెప్పడం గమనార్హం. 11.30 తర్వాత వస్తే మీకు సార్లు దొరుకుతారని చెబుతున్నారు.


కార్యాలయం బయట ఎదురుచూపులు..

సోమవారం ప్రజావాణి కావడంతో తమ సాధక బాధకాలు చెప్పుకునేందుకు, అధికారులకు విజ్ఞ్యప్తులు ఇచ్చేందుకే జనాలు చందానగర్ సర్కిల్ కార్యాలయం వద్ద ఉదయం నుండే ఎదురుచూస్తూ నిల్చున్నారు. ఏ సమస్య కోసం జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి వచ్చిన అధికారుల కోసం నిరీక్షణ తప్పడం లేదని, గత 5 వారాలుగా వస్తున్నా ఇప్పటికి తమ సమస్య తీరడం లేదని గంగారాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క సెక్షన్ లోనూ అధికారులు సమయపాలన పాటించక పోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమయపాలన పాటించడం కాదు కిందిస్థాయి సిబ్బంది కూడా సమయానికి కార్యాలయానికి వచ్చేలా చూడాలని ప్రజలు సూచిస్తున్నారు.

సాకులు చెప్పేందుకు ప్రయత్నాలు..

సమయానికి ఆఫీసుకు రావడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంపై ఓ అధికారిని ప్రశ్నిస్తే.. కోర్టు కేసులు, సైట్ విజిట్లు, పాత పనులు మాకు ఎన్ని ఉంటాయి.. సిటీ లో సమయానికి రావడం అంత ఈజీ కాదు అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఒక్కోరిది ఒక్కో బాధ.. కోర్టు కేసులకే సమయం సరిపోతుంది. ఎప్పుడు ఎక్కడ ఉంటామో మాకే తెలియదు అని చెప్పారు.


నెలల తరబడి తిరుగుతున్న : జై భీం యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కంది పెంటయ్య

గంగారాం గ్రామంలో జై భీమ్ యూత్ అసోసియేషన్ కోసం స్థలం కేటాయింపుకు సంబంధించి చందానగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్న.. ఇప్పటికి అధికారులు స్పందించలేదు. ప్రతి సోమవారం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న అధికారులు మాత్రం సమయానికి రావడం లేదు.

Advertisement

Next Story

Most Viewed