Amit Shah: ఉగ్రవాదంపై యుద్ధం ముగిసిపోలేదు.. పోలీసు అమరణ సంస్మరణ సభలో అమిత్ షా వ్యాఖ్యలు

by Shamantha N |
Amit Shah: ఉగ్రవాదంపై యుద్ధం ముగిసిపోలేదు.. పోలీసు అమరణ సంస్మరణ సభలో అమిత్ షా వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తరిమేయాలని తమ ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah) అన్నారు. ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు అమిత్‌ షా నివాళులర్పించారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ముగియలేదన్నారు. డ్రగ్స్‌, భారత వ్యతిరేక చర్యలు, ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఏడాదిలో 216 మంది మృతి

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమని అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36,468 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని.. వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని అన్నారు. గత ఏడాది దాదాపు 216 మంది పోలీసులు విధినిర్వహణలో మరణించారన్నారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. ‘‘ఎన్డీఏ పదేళ్ల పాలనలో జమ్ము కశ్మీర్‌, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంది. అయినా మా పోరాటాన్ని ఆపం. కశ్మీర్‌లో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం’’ అని అన్నారు. ఇకపోతే, 1959లో లడఖ్‌లో చైనా సైనికులు జరిపిన ఆకస్మిక దాడిలో మరణించిన పోలీసులు, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఏటా అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed