Doppelganjers : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు నిజంగానే ఉంటారా?

by Javid Pasha |   ( Updated:2024-10-21 09:14:37.0  )
Doppelganjers : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు నిజంగానే ఉంటారా?
X

దిశ, ఫీచర్స్ : ఒకే విధమైన పోలికలు కలిగిన వ్యక్తులను (కవలలు) మీరు చూసే ఉంటారు. అలాగే కవలలు కాకపోయినా ఏదో ఒక వ్యక్తిని పోలిన మరో వ్యక్తి ఉండటం కూడా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని కూడా కొందరు చెప్తుంటారు. ఇది నిజమేనా? నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.

ఇటాలియన్ రేసర్ ఎంజో ఫెరారీ, జర్మనీ ఫుట్ బాలర్ మేసర్ ఓజిల్‌లను మీరు గమనించారా..? దాదాపు వీరు ఒకేలా ఉండటంతో ఇద్దరి ఫొటోతో కూడిన వార్త ఒకటి ఇటీవల వైరల్ అయింది. వీళ్లే కాదు.. ఫలానా వ్యక్తులు సేమ్ టు సేమ్ ఉన్నారంటూ పోల్చే సమాచారం, ఫొటోలు, వీడియోలు వివిధ సోషల్ మీడియా వేదికల్లో కనిపిస్తుంటాయి. ఇవి చూసి కొందర ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, మరి కొందరు అది కామనే.. ప్రపంచంలో ఒకే పోలిక కలిగిన వ్యక్తులు ఏడుగురు ఉంటారని చెప్తుంటారు. కవలలు, అలాగే అరుదుగా ఎక్కడో ఒకచోట అచ్చం ఒకేలాంటి పోలికలు కలిగిన వ్యక్తులు అక్కడక్కడా ఉంటారు. వీరిని ‘డోపెల్ గాంజర్స్ (doppelgangers)’ అని, ఈవిల్ ట్విన్స్ అని అంటారు. ప్రతీ ట్రిలియన్ మందిలో ఒకరు ఇలాంటి వారు ఉండవచ్చునని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వీరి మధ్య జీవ సంబంధం ఉండదు కానీ కవలల్లా అగుపిస్తుంటారు. ఇక కవలల గురించి తెలిసిందే. జన్యుపరమైన కారణాలతో వీరు ఒకే విధమైన పోలికతో ఉంటారు.

అయితే ఏడుగురు ఒకేపోలికతో ఉండటం అనేది కూడా నిజమేనా?.. ఏమాత్రం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలి? ఎలాంటి రూపాన్ని సంతరించుకుంటారు అనేది వారి తల్లిదండ్రుల డీఎన్ఏ, క్రోమోజోములు, జన్యువులపై డిపెండ్ అయి ఉంటుంది. ప్రతీ మనిషి 23 జతల క్రోమోజోములు కలిగి ఉంటారు. కాగా ప్రతీ క్రోమోజోమ్ రెండు భాగాలుగా విభజించబడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే జన్మించే ప్రతీ శిశువు తల్లి నుంచి అలాగే తండ్రి నుంచి ఒక జత చొప్పున క్రోమోజోములను పొందుతుంది. ప్రతి ఒక జత క్రోమోజోములు తమలో తాము వివిధ భాగాలను ఇచ్చిపుచ్చుకొని కొత్త క్రోమోజోములుగా ఏర్పడతాయి. ఇలాంటి జెనెటిక్ క్రాసింగ్ కారణంగానే ఈ ప్రపంచంలో ప్రతీ వ్యక్తి రూపం, ప్రవర్తన ఒకేలా కాకుండా వేర్వేరుగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి సేమ్ టు సేమ్ ముఖం, శరీరాకృతి కలిగిన వ్యక్తులు ప్రపంచంలో ఏడుగురు ఉండే అవకాశం ఏమాత్రం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story