జమ్మూకశ్మీర్ కాల్పుల్లో పెరిగిన మృతులు.. అమిత్ షా ఆగ్రహం

by Y.Nagarani |   ( Updated:2024-10-21 04:53:54.0  )
జమ్మూకశ్మీర్ కాల్పుల్లో పెరిగిన మృతులు.. అమిత్ షా ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్లోని గాందర్ బల్ జిల్లా సోన్ మార్గ్ ప్రాంతంలో నిర్మిస్తోన్న ఓ సొరంగమార్గం వద్ద ఆదివారం సాయంత్రం ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన వారి సంఖ్య పెరిగింది. తొలుత ఈ కాల్పుల్లో ఇద్దరు వలస కూలీలు చనిపోయినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. తాజాగా ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఒక డాక్టర్, ఆరుగురు వలస కూలీలు ఉన్నట్లు తెలిపారు. సొరంగ నిర్మాణం వద్ద పనిచేసి.. తిరిగి వెళ్తున్న వారిపై ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారని పేర్కొన్నారు. ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కశ్మీర్, వీకే బిర్ది ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

ఉగ్రమూకల చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని పిరికిపందల చర్య(act of cowardice)గా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ (Jammu &Kashmir)లో అమాయకులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. వలసకార్మికులపై క్రూరత్వాన్ని చూపిన వారిని విడిచిపెట్టబోమని, ఉగ్రమూకల్ని భద్రతా బలగాలు మట్టుపెడతాయని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ వేదికగా సానుభూతిని ప్రకటించారు. ఈ కాల్పుల్లో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని, వారికి వైద్యులు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

లష్కరే తోయిబా కీలక ప్రకటన

జమ్మూకశ్మీర్లో జరిగిన కాల్పులు తమ గ్రూపుకు చెందినవారే జరిపినట్లు పాకిస్తాన్ కు చెందిన లష్కర్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) గ్రూప్ చీఫ్ షేక్ సజ్జద్ గుల్ ఈ దాడివెనుక ఉన్న మాస్టర్ మైండ్ అని, కశ్మీరీలు, వలస వచ్చినవాళ్లే టార్గెట్ గా కాల్పులు జరిపినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed