ఆ వ్యాధితో దడ.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌

by Hajipasha |
ఆ వ్యాధితో దడ.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌
X

దిశ, నేషనల్ బ్యూరో : నాలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ లక్షణాలతో కూడిన కేసులు బయటపడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా దేశంలోని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. కోళ్లు, ఇతర పక్షులకు సంబంధించిన అసాధారణ మరణాలపై అప్రమత్తంగా ఉండాలని.. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర పశుసంవర్ధక శాఖకు తెలియజేయాలని రాష్ట్రాలను కోరింది. తద్వారా బర్డ్‌ ఫ్లూ నివారణ చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌‌లోని నెల్లూరు, మహారాష్ట్రలోని నాగ్‌‌పూర్, కేరళలోని అలప్పుజ, కొట్టాయం, జార్ఖండ్‌లోని రాంచీలో బర్డ్‌ ఫ్లూ లక్షణాలతో కూడిన కేసులను గుర్తించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో యాంటీవైరల్‌ ఔషధాలు, పీపీఈ కిట్లు, మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు మే 25న కేంద్ర పశుసంవర్ధక శాఖ నిర్దేశించింది. ఇన్ఫెక్షన్ సోకిన పక్షులను వధించే వారితో పాటు వాటిని పెంచే వారి నుంచి శాంపిల్స్ సేకరించి హెచ్‌5ఎన్‌1 పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

ఏమిటీ బర్డ్‌ ఫ్లూ ?

బర్డ్‌ ఫ్లూ వ్యాధిని ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా అని కూడా పిలుస్తారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ పక్షులు, కోళ్లకు సోకుతుంటుంది. ఇన్‌ఫ్లూయెంజా టైప్‌-ఏలో డజనుకుపైగా వైరస్‌లు ఉండగా.. హెచ్5ఎన్8, హెచ్5ఎన్1 రకాలకు చెందిన వైరస్‌లు కోళ్లు, బాతులు, టర్కీలు సహా పలు పక్షులలో వేగంగా వ్యాపిస్తుంటాయి. హెచ్5ఎన్1 రకం ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ప్రాణాంతకమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1997లోనే వెల్లడించింది. భారత్‌లో మాత్రం 2006లో ఈ వైరస్‌ బయటపడింది. ఏటా మన దేశానికి వచ్చే విదేశీ వలస పక్షుల ద్వారా బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తుంటుంది.

Advertisement

Next Story