India-Canada: అమిత్ షా పై కెనడా మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |
India-Canada: అమిత్ షా పై కెనడా మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌- కెనడా(India-Canada) మధ్య దౌత్యసంబంధాలు రోజురోజుకు క్షీణించిపోతున్నాయి. ఇక, ట్రూడో ప్రభుత్వానికి చెందిన మంత్రి అమిత్ షా పై సంబంధంలేని ఆరోపణలు చేశారు. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరులపై దాడుల వెనక కేంద్ర హోమంత్రి అమిత్ షా((Amit Shah)) పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి డేవిడ్ మోరిసన్ ఒకరు ఆరోపణలు చేశారు. దీనిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన వ్యాఖ్యలని ఆరోపించింది. కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి నిరసన కూడా తెలిపింది. ‘‘ఈ వ్యవహారంలో కెనడా అధికారికి సమన్లు జారీ చేశాం. ఇటీవల ఒట్టావాలో పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ ముందు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై కెనడా డిప్యూటీ మంత్రి డేవిడ్ మోరిసన్ నిరాధారణమైన ఆరోపణలు చేశారు. దానిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాం. అలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన దౌత్యపరమైన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్‌ వెల్లడించారు.

అమెరికా ఏమందంటే?

ఇదిలా ఉంటే.. కెనడా మంత్రి మోరిసన్ వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఆ ఆరోపణలు ఆందోళనకరమని, దీనిపై తాము కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది. ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్‌ (Nijjar Murder Case) హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో గతేడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాదు, ఇటీవల మరోసారి భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజ్జర్‌ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో, సంజయ్‌ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్‌ వెనక్కి రప్పించింది. అదే సమయంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్‌ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.

Advertisement

Next Story

Most Viewed