Modi: ప్రధాని తాగే నీళ్లలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతుందా?

by Shamantha N |
Modi: ప్రధాని తాగే నీళ్లలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతుందా?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల వేళ(Delhi Assembly Elections) హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య యుమునా వాటర్ వార్ నడుస్తోంది. యమునా నదిని ఉద్దేశపూర్వకంగా హర్యానా విషపూరితం చేస్తోందంటూ ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా.. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో ఆయన ఆమ్‌ఆద్మీపార్టీ (AAP)పై విరుచుకుపడ్డారు. ప్రధాని తాగే నీళ్లలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా..? అని ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్యానా ప్రజలపై దారుణమైన ఆరోపణలు చేశారు. ఓటమి భయంతో ‘ఆపద’ (AAPda) నేతలు ఆందోళన చెందుతున్నారు. హర్యానా, ఢిల్లీలో నివసించే ప్రజలు ఒకరు కాదా..? హర్యానా ప్రజల బంధువులు దేశ రాజధానిలో లేరా..? తమ సొంత ప్రజలు తాగే నీటిని విషపూరితం చేస్తారా..? హర్యానా పంపుతున్న నీటినే ఢిల్లీలోని వారు వాడుతున్నారు. అందులోనే ఈ ప్రధాని కూడా ఉన్నారు’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యలపై మోడీ(Modi) విమర్శలు గుప్పించారు.

ఢిల్లీ గత పాలకులపై విమర్శలు

అంతేకాకుండా, ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్‌ పాలనపై మోడీ విమర్శలు చేశారు. ‘‘ఆ రెండు పార్టీలు పాతికేళ్ల పాటు ఢిల్లీని పాలించాయి. కానీ ప్రజల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ట్రాఫిక్‌ జామ్స్‌, నీళ్లు నిలవడం, కాలుష్యం.. ప్రతి సమస్యా అలాగే ఉంది. మీ ఒక్క ఓటు మాత్రమే పరిస్థితిని మారగలదు. వీటి నుంచి విముక్తి కలిగించగలదు. 11 ఏళ్లపాటు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలి. 25 సంవత్సరాల భవిష్యత్తు ప్రణాళికను వేయాలి. 25 సంవత్సరాలు ఆ రెండు పార్టీల పాలన చూశారు. ఇప్పుడు కమలానికి ఓ అవకాశం ఇవ్వండి. అందుకే ఢిల్లీ కోసం మోడీకి పని చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఒక కుటుంబ యజమాని తన ఫ్యామిలీని ఎలా చూసుకుంటాడో, నేను ఢిల్లీ కోసం కూడా అలాగే చేస్తాను’’ అని ఓటర్లను కోరారు.

Next Story

Most Viewed