కేజ్రీవాల్‌కు కొత్త చిక్కులు.. కేంద్రం, గవర్నర్ సూచనతో కాగ్ ప్రత్యేక ఆడిట్

by Vinod kumar |
కేజ్రీవాల్‌కు కొత్త చిక్కులు.. కేంద్రం, గవర్నర్ సూచనతో కాగ్ ప్రత్యేక ఆడిట్
X

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సీఎం అధికారిక భవనం పునరుద్ధరణలో ఆర్థిక, పరిపాలనపరమైన అవకతవకలపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశించడంతో ఆడిటింగ్ బాధ్యతను కాగ్ తీసుకుంది. 2020-22 మధ్య కాలంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసం పునరుద్ధరణకు రూ.52.71 కోట్లు ఖర్చయిందని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ రికార్డుల ద్వారా తెలిసింది. ఇందులో ఇంటి నిర్మాణానికి రూ.33.49 కోట్లు, సీఎం క్యాంపు కార్యాలయానికి రూ.19.22 కోట్లు ఖర్చు చేశారు.

దిగుమతి చేసుకున్న మార్బుల్స్, ఖరీదైన ఇంటీరియర్స్, ఎలక్ట్రికల్ పరికరాలు, అత్యాధునిక వంటగది పరికరాల కోసం ఇంత భారీ ఎత్తున వెచ్చించారు. తాను విలాసాలు అనుభవించనని 2013 నాటి అఫిడవిట్‌లో పేర్కొన్న కేజ్రీవాల్.. కొవిడ్‌తో ఢిల్లీ ప్రజలు మరణిస్తున్న వేళ తన నివాసానికి ఇన్ని కోట్లు ఖర్చు చేయడం ఆయన విలాసాలకు నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. అయితే.. సీఎం ఇల్లు అధ్వాన్నంగా ఉండటం వల్లే పునరుద్ధరించామని, ఇది ప్రభుత్వ ఆస్తిగానే మిగిలిపోతుందని, కేజ్రీవాల్ సొంతానికి ఖర్చు చేసుకోలేదని ఆమ్ ఆద్మీ పార్టీ వివరించింది.

Advertisement

Next Story