‘లక్పతీ దీదీ’ లక్ష్యం 3 కోట్లు.. ‘ఉపాధి హామీ’కి 86వేల కోట్లు

by Hajipasha |
‘లక్పతీ దీదీ’ లక్ష్యం 3 కోట్లు.. ‘ఉపాధి హామీ’కి 86వేల కోట్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక పురోగతికి చేయూతనిచ్చే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. ‘లక్పతీ దీదీ’ స్కీమ్‌ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దాదాపు కోటి మంది గ్రామీణ వనితలు లక్షాధికారులుగా మారారని ఆమె చెప్పారు. ఈ స్కీమ్‌లో భాగంగా 9 కోట్ల మంది మహిళలతో కూడిన 83 లక్షల స్వయం సహాయక సంఘాలు సాధికారత , స్వావలంబనతో పురోగమిస్తూ గ్రామీణ సామాజిక, ఆర్థిక దృశ్యాన్ని మారుస్తున్నాయని నిర్మల కొనియాడారు. మరింత మంది గ్రామీణ మహిళలను లక్షాధికారులుగా చేసేందుకే ఈ స్కీం లక్ష్యాన్ని పెంచామని స్పష్టం చేశారు.

‘లక్పతీ దీదీ’ స్కీమ్ ఏమిటి ?

గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా గ్రామాల్లోని 2 కోట్ల​ మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించేందుకు ‘లక్పతీ దీదీ’ స్కీమ్‌‌ను ప్రకటించారు. ఈ పథకం కింద మహిళలకు ప్లంబింగ్, ఎల్‌ఈడీ బల్బుల తయారీ, డ్రోన్‌లను ఆపరేట్ చేయడం, రిపేర్ చేయడం వంటి నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నారు. ఈ పనులు నేర్చుకున్నాక మహిళల జీవనోపాధి మెరుగుపడి.. వారు ఏటా రూ.లక్షకుపైగా ఆదాయాన్ని పొందేలా కేంద్ర సర్కారు వైపు నుంచి సహాయ సహకారాలను అందిస్తారు.

గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు ఇలా..

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు భారీగా రూ. 1.80 లక్షల కోట్లను కేటాయించారు. ఇందులో రూ.1.77 లక్షల కోట్లను శాఖ పరిధిలోని గ్రామీణాభివృద్ధి విభాగానికి, రూ.2,666 కోట్లను భూవనరుల విభాగానికి అలాట్ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గతేడాది బడ్జెట్‌లో రూ.60,000 కోట్లనే అందించగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ.86వేల కోట్లకు పెంచారు. రుతుపవనాల దోబూచులాటతో అలుముకున్న వ్యవసాయ సంక్షోభం, దడపుట్టిస్తున్న ధరల మంట నుంచి పేద ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఈ స్కీం‌కు కేంద్ర సర్కారు నిధులను పెంచింది.

Advertisement

Next Story