Haryana assembly election: హుడా కుటుంబాన్ని పాండవులతో పోల్చిన బ్రిజ్ భూషణ్

by Shamantha N |
Haryana assembly election: హుడా కుటుంబాన్ని పాండవులతో పోల్చిన బ్రిజ్ భూషణ్
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ హుడా కుటుంబాన్ని బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పాండవులతో పోల్చారు. హుడా కుటుంబాన్ని హర్యానా మహిళలు అస్సలు క్షమించరని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మహాభారతంలో ద్రౌపదిని పణంగా పెట్టి పాండవులు జూదం ఆడి ఓడిపోయారు. దీనికి పాండవులను దేశం ప్రజలు ఇప్పటికీ క్షమించలేదు. అలాగే హర్యానా మహిళలు, సోదరీమణుల పరువుకు భంగం కలిగించిన హుడా కుటుంబాన్ని కూడా భవిష్యత్ లో ఎవరూ క్షమించరు. ఈ విషయంలో వారిని ఎప్పుడూ దోషులుగానే భావిస్తారు’’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల రెజ్లర్లు వినేశ్‌ ఫోగట్, భజరంగ్‌ పూనియాలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే.. రెజ్లర్లు తనపై ఆందోళన చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన కుట్ర బయటపడిందని అన్నారు. రెజ్లర్లు ఆందోళన చేపట్టడం వెనకాల హర్యానా మాజీ సీఎం భూపేందర్‌ హుడా, ఆయన కుమారుడు దీపేందర్‌ హుడా ఉ‍న్నారని మండిపడ్డారు. తాను మూడు ప్రధాన కేసులను ఎదుర్కొంటున్నానని.. అదంతా కోర్టు పరిధిలో ఉందన్నారు. వాస్తవాలు బయటపడితే ప్రతిపక్షాలు విమర్శించబోవని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం 32 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. జింద్ జిల్లాలోని జులనా నియోజకవర్గం నుంచి వినేష్ ఫోగట్‌ను హస్తం పార్టీ బరిలో దించింది.

వినేశ్ ఫొగాట్ ఏమన్నారంటే?

మరోవైపు.. బ్రిజ్‌ భూషన్‌ చేసిన వ్యాఖ్యలపై వినేశ్‌ ఫోగట్‌ స్పందించారు. ఆమె ఆదివారం జులనా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినేశ్‌ మాట్లాడుతూ.. “నేను రెజ్లింగ్‌లో ఏది సాధించినా అది ప్రజల వల్లే. రాజకీయాల్లోనూ విజయం సాధిస్తానని ఆశిస్తున్నా. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన గురించి తర్వాత మాట్లాడుతా. బ్రిజ్ భూషణ్ ఏం దేశం కాదు.. ప్రజలు నాతో ఉన్నారు. వారు నా సొంతం. నా సొంత ప్రజలే నన్ను ఆదరించారు. అన్ని పోటీల్లో విజయం సాధిస్తా. పతకం రాలేదన్న బాధ స్వదేశంలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాతే తగ్గింది. నేను సవాళ్లను ఎదుర్కొంటున్నా’ అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed