ఈ అవినీతి అధికారులు ఎంత మంచోళ్ళు!..లంచాలు తీసుకోవడంలోనూ మానవత్వం

by Prasad Jukanti |
ఈ అవినీతి అధికారులు ఎంత మంచోళ్ళు!..లంచాలు తీసుకోవడంలోనూ మానవత్వం
X

దిశ, డైనమిక్ బ్యూరో:అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎన్ని తనిఖీలు చేపట్టినా కొంతమంది లంచగొండి అధికారులు తమ తీరును మార్చుకోవడం లేదు. ముడుపులు ఇవ్వనిదే పని ముట్టకుండా పేదలను లంచాల కోసం రాచి రంపాన పెడుతున్న అధికారులు తరచూ కనిపిస్తూనే ఉన్నారు. అయితే గుజరాత్ లోని కొంత మంది లంచావతారులైన అధికారులు మాత్రం లంచాలు తీసుకోవడంలో మానవత్వం ప్రదర్శిస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. లంచావతారులేంటి? ప్రజలపై మానవత్వం చూపడమేంటని అనుకుంటున్నారా? అదే ఈ అక్రమార్కుల వద్ద ఉన్న జిమ్మిక్కు. ఇంతకీ ఏం జరిగిందంటే..

గుజరాత్ లోని ప్రభుత్వ అధికారులు పనులు నిమిత్తం తమ వద్దకు వచ్చే పేద ప్రజల వద్ద నుంచి వేలకు వేలు లంచాలు డిమాండ్ చేస్తున్నారట. అయితే చాలా మంది బాధితుల్లో పేదలు ఉండటం వల్ల వారి వద్ద నుంచి లంచాలను ఈఎంఐ రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారట. ఇటీవల ఓ సీఐడీ క్రైమ్ ఇన్ స్పెక్టర్ దొంగ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాధితుడి వద్ద నుంచి రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారు. ఇంత ఇచ్చుకోలేనని చెప్పగా ఈ మొత్తాన్ని వాయిదాల పద్దతిలో నెలకు రూ.10 వేలు చెల్లించేలని సూచించారట. ఈ నెల ప్రారంభంలో గుజరాత్ వాటర్ సప్లై బోర్డుకు చెందిన అధికారి ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.1.2 లక్షల లంచం డిమాండ్ చేశాడు. అంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేనని చెప్పేసరికి దానిని నెలకు. రూ.30 వేల చొప్పున ఇన్ స్టాల్ మెంట్లుగా చెల్లించాలని సూచించారట.

మరో కేసులో ఈ ఏడాది మార్చిలో ఎస్ జీఎస్టీ బోగస్ బిల్లింగ్ స్కామ్ లో నిందితుడి నుంచి అధికారులు రూ.21 లక్షలు డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని నెలకు రూ.2 లక్షల చొప్పిన 10 వాయిదాల్లో చెల్లించాలని సూచించారట. ఇదే ఏడాది ఏప్రిల్ లో సూరత్ లోని ఓ ఉప సర్పంచ్, తాలుకా మెంబర్ గ్రామంలోని రైతుల నుంచి రూ. 85 వేలు డిమాండ్ చేశారు. అయితే గ్రామీణ ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకుని లంచాలన్ని ఈఎంఐలుగా చెల్లించాలని సూచించారట. మరో నాలుగు సైబర్ కేసుల్లోనూ పోలీసులు రూ. 10 లక్షల లంచాన్ని నాలుగు ఈఎంఐల్లో అడిగారట. ఈ లంచావతారుల కొత్త రకం ట్రెండ్ గురించి గుజరాత్ యాంటీ కరెప్షన్ బ్యూరో డీజీపీ షంషేర్ సిగ్ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. దీంతో ఈ అక్రమార్కుల కొత్తదారులు చూసిన జనం ఈ లంచగొండి అధికారులది ఎంత మంది మనసు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed