గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు: 12 మంది మృతి

by samatah |
గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు: 12 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బెమెతారా జిల్లాలోని గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించగా..12 మంది మృతి చెందారు. బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో ఉన్న స్పెషల్ బ్లాస్ట్ లిమిటెడ్ గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలుడు జరిగినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో 10 మంది మరణించగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రాయ్ పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

శిథిలాల కింద చాలా మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుడు ప్రభావంతంతో స్థానికంగా ఉండే చాలా ఇళ్లకు పగుళ్లు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో 25 మంది విధుల్లో ఉన్నట్టు సమాచారం. ఘటన అనంతరం స్థానికులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీలోని కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యం ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఇటీవల ఓ రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed