Kangana Ranaut : అన్నదాతలను తిట్టడమే బీజేపీ పని : రాహుల్ గాంధీ

by Hajipasha |
Kangana Ranaut : అన్నదాతలను తిట్టడమే బీజేపీ పని : రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో : రైతుల నిరసనలపై బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలతో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. కేంద్ర సర్కారు నిర్ణయాల వల్లే ఆ వ్యవహారం అదుపులోకి వచ్చింది. ఆ నిరసనల వెనుక విదేశీ కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం చర్యలు తీసుకోకపోయి ఉంటే మన దేశంలోనూ బంగ్లాదేశ్‌ తరహా పరిస్థితి ఏర్పడేది’’ అని పేర్కొంటూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కంగన పోస్ట్ చేసిన వీడియోపై రాజకీయ దుమారంపై రేగుతోంది. దీంతో ఆమె వ్యాఖ్యలను చివరకు బీజేపీ అధిష్టానం కూడా తప్పుపట్టింది. ‘‘రైతుల నిరసనల విషయంలో కంగన వైఖరి సరికాదు. బీజేపీ విధానాల గురించి మాట్లాడే అధికారం ఆమెకు లేదు. అలా మాట్లాడేందుకు పార్టీ తరఫున కంగనకు ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆమెను ఆదేశించాం’’ అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్, సామాజిక సామరస్య భావనలకు మా పార్టీ సదా కట్టుబడి ఉంటుంది’’ అని ఆ పోస్టులో బీజేపీ స్పష్టంచేసింది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ..

కంగనా రనౌత్‌ వ్యాఖ్యలపై బీజేపీ పంజాబ్ యూనిట్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ఉద్రేకపూరిత ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆమెకు హితవు పలికింది. ‘‘కంగన చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. బీజేపీకి వాటితో సంబంధం లేదు. ప్రధాని మోడీ, బీజేపీ రైతు పక్షపాతి. ఆమె సున్నిత అంశాలపై, మతపరమైన అంశాలపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి’’ అని పంజాబ్ బీజేపీ నాయకుడు హర్జిత్ గరేవాల్ సూచించారు. త్వరలోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో రైతుల ఓటు బ్యాంకు చాలా బలమైనది. రైతు సంఘాలు ఏ పార్టీ వైపు తిరిగితే ఆ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ముమ్మరంగా ఉంటాయి. ఈ అంశాన్ని గుర్తించినందు వల్లే కంగనా రనౌత్ వ్యాఖ్యలను బీజేపీ వెంటనే ఖండించి, దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

రైతులను అవమానించేలా వ్యాఖ్యలు..

ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే తాపత్రయం బీజేపీకి లేదు.. కానీ అన్నదాతలను తిట్టే పనిలో ఆ పార్టీ బిజీగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అన్నదాతల నిరసనల వెనుక విదేశీ హస్తం ఉందంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను బట్టి బీజేపీ రైతు వ్యతిరేక వైఖరిని అర్థం చేసుకోవచ్చన్నారు. 378 రోజుల పాటు ఉద్యమం చేసి అమరులైన 700 మంది రైతులను రేపిస్టులు అని కంగన పిలవడం బాధాకరమన్నారు. యావత్ దేశంలోని రైతులను అవమానించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని రాహుల్ పేర్కొన్నారు. ‘‘రైతులు నిరసనలు ముగించే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నేటికీ కోల్డ్ స్టోరేజీలోనే ఉంది. పంటలకు కనీస మద్దతు ధరపై వైఖరి ఏమిటో మోడీ సర్కారు స్పష్టం చేయాలి. అమరులైన రైతుల డిమాండ్లను ఇప్పటిదాకా కేంద్రం నెరవేర్చలేదు. అంతటితో ఆగకుండా అన్నదాతలను అవమానించడానికి బరి తెగిస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ‘‘అన్నదాతలంటే బీజేపీకి ఎందుకంత ద్వేషం? కాషాయ పార్టీ నేతలు నోరు విప్పితే చాలు అబద్ధాలే చెబుతారు. రైతులను మోసం చేయడం, విమర్శించడమే వాళ్ల పనిగా మారింది. రైతన్నలపై కంగనా రనౌత్ చేసిన చౌకబారు ఆరోపణలు నిరాధారమైనవి. బీజేపీ ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఆమె ఈ కామెంట్స్ చేసి ఉంటారు’’ అని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా విమర్శించారు.

Advertisement

Next Story