Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై హత్యాప్రయత్నం!: ఆప్

by Mahesh Kanagandla |   ( Updated:2024-10-25 16:40:36.0  )
Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై హత్యాప్రయత్నం!: ఆప్
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly Elections) ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నది. ఇందులో భాగంగానే ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పాదయాత్రలు చేపడుతున్నారు. వెస్ట్ ఢిల్లీలోని వికాస్‌‌పురి ఏరియా గుండా శుక్రవారం పాదయాత్ర చేస్తుండగా.. ఆయనపై హత్యా ప్రయత్నం జరిగిందని ఆప్ ఆరోపిస్తున్నది. బీజేపీ బురద రాజకీయాలు ఇంకా ఎంత దిగజారుతాయో ఢిల్లీ ప్రజలు చూస్తున్నారని, కేజ్రీవాల్‌ను ఓడించలేమనే అవగాహనకు వచ్చిన తర్వాత వారు ఆయనపై హత్యాప్రయత్నాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయనకు ఏమైనా జరిగితే అందుకు బీజేపీనే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది.

‘బీజేపీ రాజకీయాలు ఎంతలా దిగజారగలవో ఢిల్లీ ప్రజలు చూస్తున్నారు. వికాస్‌పురి కాలనీలో పాదయాత్ర చేస్తుండగా అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ గూండాలు దాడి చేశారు. ఆప్, అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించడం బీజేపీ వల్ల కాదు, అందుకే అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేయాలనే కుట్రకు తెరతీశాయి’ అని ఢిల్లీ సీఎం అతిషి మార్లేనా కామెంట్ చేశారు. ‘ గత రెండేళ్లుగా అరవింద్ కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టడానికి అన్ని అవకాశాలను బీజేపీ ఉపయోగించుకుంది. తప్పుడు కేసుల్లో అరెస్టు చేయడం, 30 ఏళ్లు డయాబెటిస్‌తో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్‌ జైలులో ఉన్నప్పుడు ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడానికి బీజేపీ నిరాకరించింది. ఆయనను ఇబ్బంది పెట్టడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేయాలని డిసైడ్ అయ్యాయి. అందుకే ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు హత్యకు ప్లాన్ చేశారు’ అని ఆరోపించారు.

కేజ్రీవాల్‌కు ఇప్పటికీ విశేష ప్రజాదారణ దక్కడంతో బీజేపీ తట్టుకోలేకపోతున్నదని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. ప్రజల ప్రేమను చూరగొంటున్న అరవింద్ కేజ్రీవాల్‌ను హత్య చేయాలని ఆయనపై దాడి జరిగిందని చెప్పారు. ఒక వేళ అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే అందుకు బీజేపీనే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

బీజేపీకి ఓటేస్తున్నారా? జాగ్రత్త!

పాదయాత్రలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీరు బీజేపీకి ఓటువేస్తున్నారా? మళ్లీ ఢిల్లీలో విద్యుత్ కోతలకు రెడీ కావాలి. యూపీ, బిహార్‌లలో 8-10 గంటల వరకు విద్యుత్ కోత ఉన్నది. కానీ, ఢిల్లీలో విద్యుత్ ఉచితం’ అని కేజ్రీవాల్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed