రామమందిర ప్రారంభోత్సవం పేరుతో బీజేపీ జిమ్మిక్కు : మమత

by Hajipasha |
రామమందిర ప్రారంభోత్సవం పేరుతో బీజేపీ జిమ్మిక్కు : మమత
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం పేరుతో బీజేపీ జిమ్మిక్కులు చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో రామమందిర అంశంతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని జోయ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఇతర వర్గాల ప్రజలను మినహాయించే ఉత్సవాలకు తాను మద్దతు పలకబోనని దీదీ తేల్చి చెప్పారు. మత ప్రాతిపదికన దేశ ప్రజలను విభజించే పనులను సమర్ధించబోనని స్పష్టం చేశారు. ‘‘అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే ఉత్సవాలను మాత్రమే నేను నమ్ముతాను. కోర్టు సూచనల మేరకే రామమందిరాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రారంభిస్తోంది. అయితే ఆలయం ప్రారంభోత్సవాన్ని సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తుండటం పెద్ద జిమ్మిక్కు’’అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కాగా, అయోధ్య రామ మందిరాన్ని జనవరి 22న ప్రారంభించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed