ఆప్, బీజేపీ మధ్య 'రావణ' యుద్దం

by John Kora |
ఆప్, బీజేపీ మధ్య రావణ యుద్దం
X

- బీజేపీ నాయకులను మాయా లేడీతో పోల్చిన కేజ్రివాల్

- కేజ్రివాల్ రామాయణాన్ని అవమానించారన్న బీజేపీ

- రావణుడు వారసులు మేల్కొన్నారన్న సిసోడియా

దిశ, నేషనల్ బ్యూరో:

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్దం పెరిగింది. రామాయణంలోని రాముడు, సీత పాత్రలను అర్వింద్ కేజ్రివాల్ అవమానించారంటూ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు విరేంద్ర సచ్‌దేవ ఉపవాసం ఉండి నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ప్రాచీన్ హనుమాన్ టెంపుల్‌ను మంగళవారం సందర్శించిన అనంతరం సచ్‌‌దేవ మాట్లాడుతూ కేజ్రివాల్ ఒక 'చునావీ హిందూ' (ఎన్నికల హిందువు) అన్నారు. సీతా రాముడి పట్ల ఆయన చూపిన అగౌరవానికి క్షమించమని కోరడానికే తాను దేవాలయానికి వచ్చానని చెప్పారు. కేజ్రివాల్ లాంటి చునావీ హిందూ ఎన్నికల ర్యాలీల్లో దేవతలను స్మరించుకుంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారని విమర్శించారు.

సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ఒక ఎలక్షన్ ర్యాలీలో రామాయణంలోని ఒక ఘట్టాన్ని కేజ్రివాల్ గుర్తు చేశారు. బంగారు జింక రూపంలో వచ్చిన రావణుడు సీతను అపహరించినట్లే.. రావణుడు వారసులైన బీజేపీ నాయకులు కూడా మాయా లేడి లాగా వచ్చి ప్రజల భూములను కొల్లగొడతారని ఆరోపించారు. మాయా లేడీ లాంటి బీజేపీ నేతల ఉచ్చులో చిక్కుకోవద్దని కేజ్రివాల్ ప్రజలను హెచ్చరించారు. కేజ్రివాల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. సనాతన ధర్మాన్ని కేజ్రివాల్ అవమానించారని, రామాయణాన్ని ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని పార్టీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ పేర్కొన్నారు. కేజ్రివాల్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటి ముందు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. రామాయణ పాత్రలను అవమానించినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీ నాయకులు నిరసనలపై ఆప్ నేత మనీష్ సిసోడియా స్పందించారు. కేజ్రివాల్ ఓ బహిరంగ సభలో రావణుడికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. దీనిపై వెంటనే రావణుడి వారసులు స్పందించారని బీజేపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బీజేపీ నేతలు ఢిల్లీ ప్రజలకు రావణుడి కంటే పెద్ద ముప్పుగా మారతారని హెచ్చరించారు. ప్రజల భూములను ఆక్రమించడానికే వారు అధికారాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సిసోడియా పేర్కొన్నారు.

Next Story

Most Viewed