నోటా ఓట్లలో బీహార్ రికార్డు

by S Gopi |
నోటా ఓట్లలో బీహార్ రికార్డు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అనేక ఆసక్తికర అంశాలు నమోదయ్యాయి. అందులో నోటా ఓట్ల అంశం కూడా ఒకటి. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో దాదాపు 1 శాతం మంది ఓటర్లు ఈవీఎంలలో నోటా బటన్‌ను నొక్కారు. ఇందులో అత్యధికంగా బీహార్ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. 2013, అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన నోటా బటన్ అనేకసార్లు ఓటర్లకు కీలక ఎంపికగా నిలిచింది. ఏదైనా నియోజకవర్గంలో ఏ అభ్యర్థీ కూడా నచ్చకపోతే ఓటర్లు నోటాకు నొక్కి తమ నిర్ణయాన్ని స్వేచ్ఛగా వెల్లడించే అవకాశంగా నోటా మారింది. లోక్‌సభకు 40 మంది సభ్యులను పంపిన బీహార్ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా 2.07 శాతం నోటా ఓట్లు సాధించింది. దీని తర్వాత మధ్యప్రదేశ్‌లో 1.41 శాతం నోటా ఓట్లు పోలయ్యాయి. మధ్యప్రదేశ్‌లో మరో ఆసక్తికర అంశం.. 29 పార్లమెంటరీ సెగ్మెంట్‌లలో ఒకటైన ఇండోర్‌లో ఇప్పటివరకు ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 2,18,674 నోటా ఓట్లు నమోదయ్యాయి. ఏప్రిల్ 29న జరిగిన ఎన్నికల పోలింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ ప్రజలను నోటాకు వేయాలని కోరింది. అందుకే ఇక్కడ అన్ని నోటా ఓట్లు వచ్చాయి. వీటి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అనేక ర్యాలీలు, రోడ్‌షోలతో దూకుడుగా ప్రచారం చేసిన తమిళనాడులో సైతం 1.06 శాతం నోటా ఓట్లు వచ్చాయి. అలాగే, ఓడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని 24 ఏళ్ల తర్వాత రికార్డు మెజార్టీతో బీజేపీ కైవసం చేసుకున్నప్పటికీ, ఇక్కడ 1.3 శాతం నోటా ఓట్లు పోలయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed